రెండేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం.. బ్రాండ్‌ ఏపీని పునరుద్ధరిస్తున్నాం.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండేళ్లలో గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు

4 ఆగస్టు, 2026 5:13 PM•ByRalin

Share this article

రెండేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం.. బ్రాండ్‌ ఏపీని పునరుద్ధరిస్తున్నాం.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం, రెండేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ను వివరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, ఆగస్టు 4 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండేళ్లలో గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆర్థిక శాఖపై శ్వేతపత్రం, రెండేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇప్పటివరకు ఏడు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రొగ్రెస్‌ రిపోర్టులు అందిస్తామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దానిని అంతర్జాతీయ గేట్‌వేగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

2014లో రాష్ట్ర విభజనతో రాజధానిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, బస్సులో ఉండి పాలన ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన వల్ల వచ్చిన నష్టాన్ని భరిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని, అయితే 2019-24 మధ్య మళ్లీ విధ్వంసం జరిగిందని ఆరోపించారు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదన్నారు.

2019-24 మధ్య రాష్ట్రంలో ప్రజలను వేధించే పాలన సాగిందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు, అధికారులు, పోలీసులు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రజలు నిశ్శబ్ద విప్లవం సృష్టించి ఎన్డీఏ కూటమికి 57 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఘన విజయం అందించారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేదని, విభజన తర్వాత తెలంగాణలో అది రూ.1,24,104కు చేరగా, ఏపీలో రూ.93,903కు పడిపోయిందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య రూ.30,201 తలసరి ఆదాయ అంతరం ఏర్పడిందన్నారు. అయితే తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏపీ-తెలంగాణ మధ్య వనరుల అంతరాన్ని 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించగలిగామని, రాష్ట్ర ఆర్థిక స్థితిని క్రమంగా మెరుగుపరుస్తున్నామని వివరించారు.

2019-24 మధ్య రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గడంతో రాష్ట్రానికి రూ.6.94 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ రెండేళ్లలో 30.5 శాతం సీఏజీఆర్‌ వృద్ధిని నమోదు చేయగలిగామని, జీఎస్‌డీపీ వృద్ధి 13.5 శాతానికి చేరిందన్నారు. అప్పులు-జీఎస్‌డీపీ నిష్పత్తి 28.38 శాతంగా ఉందని వివరించారు.

2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ప్రకటించిన తేదీల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే అభివృద్ధి, పెట్టుబడులు రావాల్సిందేనని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్‌, స్టీల్‌, ఏఐ, ఐటీ, ఫార్మా రంగాలను అభివృద్ధి చేస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల కోసం 28 కొత్త పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని, ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నామని వెల్లడించారు. దేశంలోనే పీపీపీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమంతో పాటు బీసీలు, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర నిధులతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి రూ.14,757 కోట్లతో కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్రంలోని 97 శాతం మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను వినియోగించుకుంటున్నాయని వివరించారు.

సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు తీసుకొచ్చిన పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమం ద్వారా ఇప్పటికే 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతోందని సీఎం తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని, అందుకే 'మార్గదర్శి–బంగారు కుటుంబం' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ప్రజలకు అందుతున్న సేవలపై నిరంతరం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని, దానికి అనుగుణంగా పాలనలో మార్పులు తీసుకొస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి రాజకీయ విభేదాలు కాకుండా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేస్తే ఫలితాలు పదిరెట్లు వస్తాయని, అదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు