అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చీరాల పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున సాయం అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమం, సంప్రదాయ వృత్తి పరిరక్షణ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది.
చేనేత రంగానికి పలు ప్రోత్సాహకాలు
'నేతన్న సేవలో' పథకంతో పాటు చేనేత రంగానికి ఇప్పటికే ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనివల్ల 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ఇందుకు ఏటా రూ.150 కోట్ల మేర వ్యయం చేస్తున్నట్లు వెల్లడించింది.
అదేవిధంగా 50 ఏళ్లు దాటిన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తూ ఏటా రూ.420 కోట్లను ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో రూ.79 కోట్ల ఆర్థిక సాయం అందించింది.
చేనేత రంగ అభివృద్ధిలో భాగంగా ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి సమీపంలోని శాఖమూరులో చేనేత-హస్తకళల మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
చీరాలలో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేటకు చేరుకుని ప్రజావేదికలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించి నిధులు విడుదల చేయనున్నారు. జాండ్రపేటలోని చేనేత వర్క్‌షాప్‌ను సందర్శించి నేతన్న కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత స్థానిక టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొని అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.





















