‘ప్రకృతి మనకు చెందినది కాదు... మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అదే దృక్పథంతో మానవ, ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం’ అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని పవన్ కళ్యాణ్ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి & వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. అడవి ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను రక్షించడం, దశాబ్దాల నుంచి ఉన్న మానవ–ఏనుగు సంఘర్షణను నివారించడమే లక్ష్యంగా ఈ శిబిరం పని చేయనుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించడం, రైతుల పంటలను ధ్వంసం చేయడం, ప్రజలు రాత్రివేళ భయాందోళనల మధ్య జీవించడం వంటి సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నప్పుడు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కొంత మంది స్థానిక ప్రజలు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావించి గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మానవ–ఏనుగు సంఘర్షణల నివారణలో ఈ కేంద్రం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ” అని తెలిపారు.
అదే విజయం రిపీట్ కావాలి
గతంలో పలమనేరు ప్రాంతంలో చేపట్టిన క్లిష్టమైన ఆపరేషన్లలో కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యుతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పని చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా మానవ–ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలను 70 శాతానికి పైగా తగ్గించడంతోపాటు, పంట నష్టాలను కూడా గణనీయంగా తగ్గించగలిగారు. అదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. మనుషులు, ఏనుగులు మధ్య సామరస్య సహజీవనానికి వేదికగా ఈ గుచ్చిమి ఏనుగుల క్యాంప్ నిలవాలనే ఆశతో దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నాను.” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
“పార్వతీపురం జిల్లాలో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజలు అందించిన సహకారం. మన విజ్ఞప్తిని గౌరవించి, ఎంతో ఆప్యాయతతో నాలుగు కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించడం వారి గొప్ప మనసుకు, స్నేహభావానికి నిదర్శనం. ఏనుగులను ఇవ్వడం అనేది సంపద ఇచ్చినట్లు అక్కడ ప్రజలు భావిస్తారు. అయినా తెలుగు ప్రజల రక్షణ కోసం ప్రేమతో కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించిన కర్ణాటక ప్రభుత్వం, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, అప్పటి అటవీశాఖ మంత్రి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్వర్ ఖండ్రేరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారం, స్నేహభావం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పెంచాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.




















