అమరావతి, జూలై 30: సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిమ్మల రామానాయుడితో మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చర్చించారు. ఈ సందర్భంగా- కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు పవన్ కల్యాణ్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్టు నిమ్మల రామానాయుడు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావం, దాని వల్ల ఏర్పడుతున్న నీటి కొరత పరిస్థితులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అవకాశం ఉన్న చోట రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మత్తులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని చెప్పారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.





















