అమరావతి, ఆగస్టు 12 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో 25 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లో మొత్తం రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం అవసరమే అయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎంత మేరకు ఇన్సెంటివ్‌లు ఇవ్వగలమనే అంశంపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాజెక్టులపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని అన్నారు.
ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లకు అవసరమైన నీటి వినియోగంపై ఉన్న అపోహలను తొలగించాలని సీఎం సూచించారు. అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీ ఆధారంగా విశాఖలోని పరిశ్రమలకు సమృద్ధిగా నీటిని తీసుకెళ్లేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వస్తున్న పరిశ్రమల ద్వారా రాష్ట్ర ఎకోసిస్టమ్‌కు ఎంత విలువ జోడిస్తున్నామనే అంశాన్ని కూడా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమని చంద్రబాబు అన్నారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబరులో ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లాజిస్టిక్స్, ఆధునిక వేర్‌హౌసింగ్, కోల్డ్‌చైన్ ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని మెరుగుపరచాలని తెలిపారు.
గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, SIPBలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబరు నాటికి మిగిలిన 37 MSME పార్కులను పూర్తి చేసి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు జరిగిన 20 SIPB సమావేశాల్లో 363 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా మొత్తం రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా.. సుమారు 10.86 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని వెల్లడించింది.
20వ SIPB సమావేశంలో కర్నూలు జిల్లాలో ఓకెయిర్ గ్రీన్ ఫ్యూయెల్స్ రూ.616 కోట్ల పెట్టుబడితో 130 మందికి, జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్ రూ.1,533 కోట్లతో 250 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. విజయనగరంలో ఎఫ్‌పీఈఎల్ రవ్వేద పవర్ రూ.480 కోట్ల పెట్టుబడితో 275 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కాకినాడలో వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.15,000 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పించనుంది.
కర్నూలులో ఆరాద్యా బయోగ్యాస్, నెల్లూరులో ఉషోదయా బయోగ్యాస్ సంస్థలు చెరో రూ.143.47 కోట్ల పెట్టుబడితో 595 మందికి చొప్పున ఉద్యోగాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా రూ.58,743 కోట్ల భారీ పెట్టుబడితో 1,250 మందికి, అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ రూ.85,200 కోట్ల పెట్టుబడితో 1,880 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
తిరుపతి జిల్లాలో మునోథ్ లిథియం బ్యాటరీ రూ.500 కోట్ల పెట్టుబడితో 240 మందికి, కడప జిల్లా కొప్పర్తి క్లస్టర్‌లో ఏఐఎల్ డిక్సన్ ఇండియా రూ.450 కోట్ల పెట్టుబడితో ఏకంగా 7,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విశాఖ జిల్లాలో ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ రూ.31,387 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉపాధి కల్పించనుంది.
కర్నూలులో అగస్త్యా గ్రీన్ ఎనర్జీ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి, విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ రూ.1,600 కోట్లతో 750 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.2,125 కోట్ల పెట్టుబడితో 400 మందికి, చిత్తూరు జిల్లా కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ రూ.880 కోట్లతో 447 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
తిరుపతి, కాకినాడ, కృష్ణా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో హోటల్, ఆతిథ్య రంగ ప్రాజెక్టులకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.500 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ పారిశ్రామిక పార్కు ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. కర్నూలులో జయాదిత్య ఆగ్రో రూ.300 కోట్ల పెట్టుబడితో 350 మందికి, నెల్లూరులో ప్రిసౌల్ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ.330.71 కోట్ల పెట్టుబడితో 1,110 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.





















