అమరావతి,ఆగస్టు11(జనవాణి): గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక భద్రతా సౌకర్యాలతో రూపొందించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 500 కొత్త వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించగా.. తొలి దశలో 300 వాహనాలను ఆగస్టు 11న ప్రారంభించనున్నారు. నరసరావుపేటలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కొత్త వాహన సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుగుణంగా జిల్లాల్లోనూ సేవలను ప్రారంభించనున్నారు.
మాతా, శిశు మరణాల తగ్గింపే లక్ష్యం
ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడం, హైరిస్క్ గర్భిణులకు అత్యవసర సమయంలో రవాణా కల్పించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడం ఈ సేవల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింత విస్తరించేందుకు కొత్త వాహనాలను జిల్లాల్లో నమోదయ్యే ప్రసవాల ఆధారంగా కేటాయించారు. మిగిలిన 200 వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన వారికి ఉచిత సేవ
ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువులకు ఎదురయ్యే రవాణా సమస్యను తొలగించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, అధిక ప్రమాద (హైరిస్క్) గర్భిణులకు అవసరమైన సమయంలో రవాణా అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైన గర్భిణులకు ప్రత్యేక పికప్, డ్రాప్‌బ్యాక్ సేవలను కూడా అందించనున్నారు.
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో అధునాతన ఫీచర్లు ఇవే...
కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎయిర్ కండిషన్డ్ SUV/MUV తరహాలో ఉంటాయి. గర్భిణులు, బాలింతలు సులభంగా వాహనంలోకి ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్టులు, హ్యాండ్‌రెయిల్స్ ఏర్పాటు చేశారు.
మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు
వెనుక సీట్లకు సీట్‌బెల్టులు
రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
చైల్డ్ లాక్ స్లైడింగ్ డోర్లు
ABS, EBD, ESP వంటి భద్రతా వ్యవస్థలు
80 కి.మీ వేగం దాటితే హెచ్చరించే స్పీడ్ అలర్ట్
అగ్నిమాపక పరికరాలు
ఉష్ణోగ్రత నియంత్రిత ఏసీ
ఫస్ట్ ఎయిడ్ కిట్
మొబైల్ ఛార్జింగ్ పోర్టులు
హ్యాండ్ శానిటైజర్, టిష్యూ పేపర్, డస్ట్‌బిన్ అందుబాటులో ఉంటాయి.
అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్
గర్భిణి కూర్చునే సీటు వద్దే ఎమర్జెన్సీ SOS బటన్ ఏర్పాటు చేశారు. దాన్ని నొక్కగానే 102 కాల్ సెంటర్‌కు సమాచారం చేరుతుంది. వాహనం ఉన్న ప్రాంతాన్ని లైవ్ GPS ద్వారా కంట్రోల్ సెంటర్‌కు పంపే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడు సమీప ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుని తక్షణ వైద్య సహాయం అందించేలా వ్యవస్థను రూపొందించారు.
GPS, NavICతో ట్రాకింగ్
వాహనాల్లో AIS-140 ప్రమాణాలకు అనుగుణమైన GPS/VLTD ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. GPSతో పాటు భారత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ NavIC ద్వారా ద్వంద్వ ఉపగ్రహ కవరేజీ అందుతుంది. డ్యూయల్ సిమ్ 4G, నెట్‌వర్క్ లేని సమయంలో సమాచారాన్ని భద్రపరిచే ఆఫ్‌లైన్ డేటా సదుపాయం, బ్యాకప్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రయాణంలో ఆరోగ్య అవగాహన
వాహనాల్లోని ప్రత్యేక ఆడియో వ్యవస్థ ద్వారా ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, తల్లిపాలు, పోషణ, టీకాలు, ప్రమాద సంకేతాలు, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రభుత్వ సూచనలు వినిపిస్తాయి. డ్రైవర్ యాప్ మ్యాపింగ్, కాల్ సెంటర్ అనుసంధానం, ఆర్‌సీహెచ్ ధ్రువీకరణలను ఐటీ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. GPS ద్వారా వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని, అందుబాటులో ఉన్న వాహనాన్ని అవసరమైన ప్రాంతానికి కేటాయించేలా వ్యవస్థను రూపొందించారు.




















