హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ NIMS) శుభవార్త చెప్పింది. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నశునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తుందని చెప్పారు.
అపాయింట్‌మెంట్ అవసరం లేదు
గుండె శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులను ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే వాక్‌ఇన్ పద్ధతిలో స్క్రీనింగ్ చేయనున్నట్లు నిమ్స్ అధికారులు తెలిపారు. నిమ్స్ పాత బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ కార్యాలయంలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్‌కు తీసుకురావచ్చు. అయితే చిన్నారుల ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్, టెస్ట్ రిపోర్ట్స్ అందుబాటులో ఉంటే తీసుకురావాలని రాహుల్ దేవరాజ్ తెలిపారు. వివరాలకు 040-23489025 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఉచిత వైద్యం
స్క్రీనింగ్, వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించిన చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నట్లు రాహుల్ దేవరాజ్ తెలిపారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజలకు అందుబాటులోకి రానున్న ఎంసీఆర్ టిమ్స్
మరోవైపు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MCR TIMS)ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన.. ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, హాస్పిటల్‌ను పూర్తిస్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రారంభమైన తొలిరోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య, సహాయక సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది తదితర మానవ వనరులను అవసరానికి అనుగుణంగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.




















