ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం - సంక్షేమం - అభివృద్ధి" కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించే ఉద్దేశంతో ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను గ్రామస్థులకు పంపిణీ చేస్తూ, వాటి ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి స్థానిక సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




















