BiggBoss 10: బిగ్ బాస్ 10లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత?..అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో కలిపి మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టీమ్ చెల్లిస్తున్న వారపు రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి హౌస్ లోకి వెళ్లిన వారి రెమ్యునరేషన్ ఎంతో ఒక్కసారి చూద్దాం.

7 సెప్టెంబర్, 2026 4:10 PM•ByNarender Kumar Nangunoori

Share this article

BiggBoss 10: బిగ్ బాస్ 10లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత?..అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

Bigg Boss, సెప్టెంబర్ 7 (జనవాణి): బిగ్ బాస్ తెలుగు గేమ్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది.

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్లు ఉన్నారు. ఇక షో ప్రారంభమైన వెంటనే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్ల ఫేమ్, క్రేజ్‌ను బట్టి వారపు పారితోషికాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్‌లో జబర్దస్త్ రాంప్రసాద్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఆయనకు వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత యాంకర్ వర్షిణికి వారానికి రూ.3.5 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉండటం, గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ టీమ్ సంప్రదిస్తున్నప్పటికీ ఆమె అంగీకరించకపోవడం.. ఈసారి భారీ పారితోషికం దక్కడానికి కారణాలుగా చెబుతున్నారు.

ముఖేష్ గౌడకు వారానికి రూ.3 లక్షలు, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్)కు రూ.2.75 లక్షలు, సీరియల్ నటి దేబ్జానీ మోదక్ రూ.2.75 లక్షలు, చైత్రా రాయ్ రూ.2.5 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే జబర్దస్త్ నరేష్‌కు రూ.2.5 లక్షలు, టెంపర్ వంశీకి రూ.2 లక్షలు, నటుడు కృష్ణుడుకు రూ.2 లక్షలు, యాంకర్ సుధీర్ రెడ్డికి రూ.1.25 లక్షలు వారానికి అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో దేబ్జానీ మోదక్, త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్ర రాయ్, రాంప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, ఆర్జే చరణ్, కృష్ణుడు, వర్షిణి, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ ఉన్నారు.

ఇక కామనర్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. గత సీజన్‌లో ఒక్కో కామనర్‌కు వారానికి రూ.70 వేల వరకు చెల్లించినట్లు సమాచారం. ఈసారి కూడా హౌస్‌లోకి వచ్చిన ఆరుగురు కామనర్లకు వారానికి రూ.70 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హాజరైన 15 మందికి ఈసారి ఒక్కొక్కరికి రూ.50 వేల చెల్లించినట్లు సమాచారం.

అయితే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌కు సంబంధించి అధికారికంగా బిగ్ బాస్ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ఆధారంగానే ఈ మొత్తాలు ప్రచారంలో ఉన్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు