టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్ తెలుగు' ముందు వరుసలో ఉంటుంది. 2017లో ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఒకరికొకరు సంబంధం లేని సెలబ్రిటీలను ఒకే ఇంట్లో ఉంచి, వారికి విభిన్నమైన టాస్కులు ఇవ్వడం ద్వారా వినోదాన్ని పంచే ఈ షో ప్రతి సీజన్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేయగా, రెండో సీజన్‌కు నాని తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి, తన హోస్టింగ్‌తో షోకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు పదో సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన 'బిగ్ బాస్ దశావతారం' ప్రోమో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి షోను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు ఆ ప్రోమోతోనే క్లారిటీ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే సెట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని, ఆగస్టు తొలి వారం నుంచి వరుసగా ప్రోమోలు, కంటెస్టెంట్లకు సంబంధించిన అప్‌డేట్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రోజుకో సెలబ్రిటీ పేరు వైరల్ అవుతుండగా, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు అబ్బాస్. 90వ దశకంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోను బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటికే సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం పదో సీజన్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
అబ్బాస్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది 'ప్రేమదేశం' సినిమా. తొలి చిత్రంతోనే ఆయన సంపాదించుకున్న క్రేజ్ అప్పట్లో ఓ సంచలనం. ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ యువతలో ఒక ట్రెండ్ ఏర్పడింది. 'అబ్బాస్ కటింగ్' అనే పేరు సెలూన్లలో కూడా బాగా వినిపించేది. తమిళంతో పాటు తెలుగులోనూ 'ప్రియా.. ఓ ప్రియా', 'రాజా', 'కృష్ణబాబు', 'అల్లుడుగారు వచ్చారు', 'నీ ప్రేమకై' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు సంపాదించారు.
2015లో వచ్చిన మలయాళ చిత్రం 'పచ్చక్కల్లం' తర్వాత సినిమాలకు దూరమైన అబ్బాస్ కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ నటనపై దృష్టి పెట్టి, జీవీ ప్రకాష్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'హ్యాపీ రాజ్' ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొంటారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే అబ్బాస్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే, పాత తరం ప్రేక్షకులతో పాటు కొత్త తరం ఆడియన్స్ కూడా ఈ సీజన్‌పై మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు.




















