జగన్ పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు దారుణం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా: బొత్స

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తనను కూడా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

31 జులై, 2026 9:16 PM•ByLaharika

Share this article

జగన్ పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలు దారుణం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా: బొత్స

మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన శ్రీకాకుళం పర్యటనపై ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధించిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా, శాంతియుతంగా పెద్ద సంఖ్యలో జగన్‌ను చూసేందుకు తరలివచ్చారని అన్నారు.

తనను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణ

తాను జగన్ కాన్వాయ్‌లో కాకుండా రెండు వాహనాల్లో శ్రీకాకుళం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని బొత్స ఆరోపించారు. ఒక వాహనంలో తాను, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు, మరో వాహనంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.

ఈ ఘటనలో తానే పోలీసులను బెదిరించినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. శాసనమండలి విపక్ష నేతగా తన నాయకుడి పర్యటనలో పాల్గొనే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. తనను అవమానించిన ఘటనపై గవర్నర్‌కు లేఖ రాసి ఫిర్యాదు చేయనున్నట్లు బొత్స తెలిపారు.

మహిళా ఎస్సైపై తమ పార్టీ నాయకులు దాడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స ఆరోపించారు. హత్యాయత్నం కేసు నమోదు చేయడం కూడా దుర్మార్గమని వ్యాఖ్యానించారు. జై జగన్ నినాదాలతో పార్టీ కార్యకర్తలు నినదిస్తుండగా మహిళా ఎస్సై చెవులు మూసుకున్న దృశ్యాలను ఆధారంగా చేసుకుని దాడి జరిగిందంటూ కేసులు నమోదు చేయడం చట్టబద్ధమేనా అని ప్రశ్నించారు.

మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

జగన్ శ్రీకాకుళం పర్యటనపై హోంమంత్రి సహా పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బొత్స విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎవరినీ బెదిరించలేదని, తనను కూడా ఎవరూ బెదిరించలేదని చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వంపై ఆరోపణలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అవసరమైన అనుమతులు పూర్తి చేశారని బొత్స పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త విమానాశ్రయం కోసం పరిశీలించిన సమయంలో భోగాపురం ఎంపికైందని చెప్పారు. భూ సేకరణ, అనుమతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామని అన్నారు.

డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు

డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకుని అక్రమాలు జరిగాయని బొత్స ఆరోపించారు. అర్హతల కంటే తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు