‘సీఎం అంటే కామన్ మ్యాన్’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం అంటే ప్రజల మధ్య ఉండే వ్యవస్థ అని, పేదలకు సేవ చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.76 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు.

1 అక్టోబర్, 2026 3:22 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘సీఎం అంటే కామన్ మ్యాన్’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

బాపట్ల జిల్లా,అక్టోబర్ 1 (జనవాణి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

“నేను కూడా బటన్ నొక్కొచ్చు.. కానీ సీఎం అంటే ప్రజల మధ్య ఉండాలి” అని చంద్రబాబు అన్నారు. తన దృష్టిలో సీఎం అంటే ‘కామన్ మ్యాన్’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయడమే తన బాధ్యతగా చెప్పారు. ప్రతి నెలా నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు.

భూ సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 54 శాతం ఓట్లు, 94 శాతం సీట్లు ఇచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. ప్రజల తీర్పుతో ప్రతిపక్షం బలహీనపడిందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ ప్రజలపై కోపంతోనే అసెంబ్లీకి రావడం లేదంటూ చంద్రబాబు విమర్శలు చేశారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రతిపక్షానికి ఆదరణ తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయని సీఎం పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ప్రజలు ఓటుతో కూటమిని గెలిపించారు అని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల ద్వారా ప్రజలకు రూ.76 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు