విజయవాడ,సెప్టెంబర్ 5 (జనవాణి): విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విద్యార్థి దశ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్నానని చెప్పారు. ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్న వారిలో చాలామంది కూడా తమ విద్యార్థి దశలో దెబ్బలు తిన్నవారేనని అన్నారు. అయితే నేటి విద్యార్థులు చాలా సున్నితంగా మారిపోయారని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
విద్యార్థులపై పాఠశాల వాతావరణంతో పాటు బయట జరుగుతున్న పరిణామాలు కూడా ప్రభావం చూపుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సంబంధించిన విషాద ఘటనలను ప్రస్తావించారు. పరీక్షల్లో విఫలమవుతామనే భయంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను అర్థం చేసుకుని వారికి మానసికంగా అండగా నిలవాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు.
టీచర్‌కు ప్రత్యామ్నాయం మరో టీచరే
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొత్త సవాళ్లు, అవకాశాలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఏఐ ద్వారా గురువు, విద్యార్థికి ఒకే సమాచారం అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం మరొక ఉపాధ్యాయుడు మాత్రమేనని స్పష్టం చేశారు. టెక్నాలజీని ఎవరూ తప్పించుకోలేరని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపాధ్యాయుల నియామకం ఎంతో కీలకమని భావించానన్నారు. కోర్టు కేసులను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించామని, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు.
గురువులను జీవితాంతం మర్చిపోలేం
‘మాతృదేవోభవ, పితృదేవోభవ.. ఆ తర్వాత ఆచార్య దేవోభవ’ అనేది భారతీయ సంస్కృతిలోని గొప్ప విలువ అని చంద్రబాబు అన్నారు. తల్లిదండ్రుల తర్వాత మన జీవితాన్ని ప్రభావితం చేసేది గురువులేనని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలోనూ భవిష్యత్తు శాస్త్రవేత్త, క్రీడాకారుడు, నాయకుడు ఉండొచ్చని.. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలు పుస్తకాలు చదవడంతో పాటు ప్రపంచాన్ని కూడా చదివేలా చేయాలని అన్నారు. విద్యార్థులపై పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రభావం ఎంతో ఉంటుందని గుర్తుచేశారు.
ఇంటర్నెట్ విప్లవాన్ని అప్పుడే గుర్తించా
తాను ఎప్పుడూ ఈరోజు గురించి మాత్రమే ఆలోచించనని.. 30, 40 ఏళ్ల తర్వాత పరిస్థితులను అంచనా వేసి ముందుగానే నిర్ణయాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. తాను తొలిసారి సీఎంగా ఉన్న సమయంలో ఇంటర్నెట్ విప్లవాన్ని గుర్తించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించానన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారిందని చెప్పారు. అమెరికా, సింగపూర్, మలేషియా, చైనా వంటి దేశాలు నాలెడ్జ్, టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి సాధించాయని వివరించారు. రాబోయే 10–15 ఏళ్లలో భారతదేశంలో భారీ మార్పులు చూడబోతున్నామని అన్నారు.
ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు
ప్రస్తుతం ప్రజలు ఫోన్‌కు ఎంతగా అలవాటు పడ్డారో చంద్రబాబు ప్రస్తావించారు. భార్యాభర్తలు కొంతకాలం ఒకరినొకరు లేకుండా ఉండగలరేమో కానీ.. ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని సూచించారు. విద్య, ఏరోస్పేస్, డ్రోన్లు, డేటా సెంటర్లు, ఫార్మా, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రాష్ట్రంలో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేశ్ నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చేయాలని భావించడం తనకు సంతోషం కలిగించిందన్నారు.
టీచర్లకు 33 శాతం రిజర్వేషన్
ఉపాధ్యాయులుగా మహిళలు సమర్థంగా బోధిస్తారనే ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకాల ద్వారా పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం తొలిసారిగా కౌన్సెలింగ్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశామని, వారు చేసిన స్ఫూర్తిదాయక కార్యక్రమాలను పుస్తకాలుగా ప్రచురించి అందరికీ అందించాలని సూచించినట్లు తెలిపారు.
2027 నాటికి ఏపీ సంపూర్ణ అక్షరాస్యత
2027 నాటికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలవాలని చంద్రబాబు లక్ష్యాన్ని ప్రకటించారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటే.. దేశంలో ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్యాన్ని సాధించే బాధ్యత గురువులపైనే ఉందన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ నిత్య విద్యార్థులుగా మారాలని సూచించారు. ప్రతి పాఠశాలను మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దితే విద్యార్థులు మరింత రాణిస్తారని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలని, వారిలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
నాయకులు అంటే కేవలం మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే కాదని, టీచర్లే నిజమైన నాయకులు అని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థులకు దిశ, దశ నిర్దేశించే బాధ్యత గురువులదేనని స్పష్టం చేశారు.




















