అమరావతి, సెప్టెంబర్ 17 (జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులను సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
బుధవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలను ముందుగానే అంచనా వేసి, ఉత్పత్తి, డిమాండ్, సరఫరా పరిస్థితులను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.
ముందస్తు అంచనాలతోనే సాగు, ఉత్పత్తి
ఏ పంటకు ఎక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమో గుర్తించి ధరలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు, రైతులను అవసరమైన పంటల సాగువైపు ప్రోత్సహించాలని చెప్పారు. అవసరమైతే రైతులతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రేషన్ డిపోల వంటి వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ముందుగా మార్కెట్ అవసరాలను అంచనా వేసి.. ఆ తర్వాతే ఉత్పత్తి చేపట్టే విధానం ఉండాలని తెలిపారు.
రేషన్ డిపోల్లో ఉల్లి, పప్పు, పామాయిల్
రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా ఉల్లి, కంది పప్పు వంటి వాటిని త్వరలో రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. పామాయిల్‌ను కూడా రేషన్ డిపోల ద్వారా అందించే అంశంపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉల్లి, మిర్చి వంటి పంటలను ప్రస్తుతం అధికంగా సాగు చేసే ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల వారీగా సాగవుతున్న పంటల వివరాలను సేకరించి, అవసరమైన ఉల్లి పరిమాణం, అందుబాటులో ఉన్న నిల్వలను ముందుగానే అంచనా వేయాలని సూచించారు.
8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు
రాష్ట్రంలో ప్రస్తుతం పంటలు సాగు చేయని 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలు, రాగి, కొర్రలు, జొన్న, బాజ్రా, మొక్కజొన్న, ఉలవలు వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాయితీ విత్తనాలు, అవసరమైన యంత్ర పరికరాలను అందించి రైతులను ఆయా పంటల సాగుకు ప్రోత్సహించాలని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంటకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో గుర్తించి, రైతులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేచురల్ ఫార్మింగ్‌ను కూడా ప్రోత్సహించాలని సూచించారు.
హైరిస్క్ ఉద్యాన పంటలకు రూ.190 కోట్లు
రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు హైరిస్క్‌లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పంటలను రక్షించేందుకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ చర్యల కోసం రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. హైరిస్క్ ప్రాంతాల్లో అవసరమైన నీటి సదుపాయాలు కల్పించాలని, వాటర్ ట్యాంకర్లను పంపించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో పశుగ్రాసం కొరత కారణంగా పాల ఉత్పత్తి తగ్గకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పశువుల దాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.




















