45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ.. నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు.

26 జులై, 2026 5:25 PM•ByLaharika

Share this article

45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ.. నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

అమరావతి: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన హామీలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 రోజులపాటు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. గత ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తు చేశారు. కూటమికి భారీ మెజారిటీతో పాటు 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు లభించాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత, కూటమి పార్టీలు చేసిన పోరాటాలే ఈ విజయానికి కారణమని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని, ప్రజాభిప్రాయాలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇంటింటి ప్రచారంలో ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి స్పష్టంగా వివరించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలతో నిరంతరం సన్నిహితంగా ఉండాలని సూచించారు.

"నాకు అనుచరులు కాదు... పార్టీకి నాయకులు కావాలి" అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. సమస్యలను పరిష్కరించే నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని అన్నారు.

యువత సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత ప్రభుత్వ విధానాల వల్ల యువత ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా వివరించాలని సూచించారు. యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

ప్రతిపక్ష పార్టీ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించాలని, డబ్బుతో మాత్రమే ప్రజల మద్దతు పొందలేమనే విషయాన్ని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని, ఆ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు