దిశా సాలియన్ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తి పేర్లు

దివంగత బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తితోపాటు పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లు ప్రస్తావించింది.

14 సెప్టెంబర్, 2026 6:13 PM•ByNarender Kumar Nangunoori

Share this article

దిశా సాలియన్ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తి పేర్లు

ముంబై,సెప్టెంబర్ 14 (జనవాణి): దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో శివసేన (యూబీటీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి పేర్లతోపాటు రోహన్ రాయ్, నటులు డినో మోరియా, సూరజ్ పాంచోలీ, షోవిక్ చక్రవర్తి తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్, డీసీపీ విశాల్ థాకూర్ పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు, ఇతర వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.

కుట్ర, ఆధారాల ధ్వంసంపై ఆరోపణలు

కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాల్సి ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కేసు పత్రాలు, ఫైళ్లు, ఇతర పబ్లిక్ రికార్డులను ధ్వంసం చేయడం లేదా దాచిపెట్టడం, అధికారిక రికార్డుల్లో అవకతవకలు, ప్రజాధనం మరియు పోలీసు బలగాల దుర్వినియోగం వంటి ఆరోపణలపై సంబంధిత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను పరిశీలించాల్సి ఉందని సీబీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మాల్వానీ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు, పోస్టుమార్టంలో పాల్గొన్న సిబ్బంది, వైద్యులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు, రెజెంట్ గెలాక్సీ భవనం సెక్యూరిటీ సిబ్బంది, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సభ్యులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్లు సమాచారం.

దిశా తండ్రి పిటిషన్‌తో కీలక మలుపు

దిశా సాలియన్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కూడా కాదని ఆమె తండ్రి సతీష్ సాలియన్ ఆరోపించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు.. ముంబై పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసుల విచారణ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కంటే మరిన్ని సందేహాలను లేవనెత్తుతోందని వ్యాఖ్యానించింది. దిశా మరణాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పరిగణించడంపైనా న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తులో ఉన్న లోపాలను కూడా కోర్టు ప్రస్తావించింది.

2020లో దిశా, ఆ తర్వాత సుశాంత్ మృతి

దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం నుంచి పడిపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. దిశా కొంతకాలం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మేనేజర్‌గా పనిచేశారు. దిశా మృతి చెందిన ఆరు రోజులకే, 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో మృతి చెందారు. తక్కువ వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందనే ప్రచారం అప్పట్లో తీవ్రంగా జరిగింది. అయితే రెండు కేసులపై వేర్వేరుగా దర్యాప్తు జరిగింది. సుశాంత్ మృతి కేసులో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది. సుశాంత్‌ది ఆత్మహత్యేనని సీబీఐ తన క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నప్పటికీ, ఆ నివేదికపై సంబంధిత న్యాయస్థానంలో తుది నిర్ణయం రావాల్సి ఉంది.

ఇక తన కుమార్తె మరణానికి ఆదిత్య థాక్రే, నటుడు డినో మోరియాకు సంబంధం ఉందని సతీష్ సాలియన్ గతంలో ఆరోపించారు. ఇటీవల ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆయన.. దిశా మరణానికి సంబంధించిన తనకు తెలిసిన వివరాలను సీబీఐ అధికారులకు వెల్లడించానని, దర్యాప్తు చేయాల్సిన వ్యక్తుల పేర్లను కూడా అధికారులకు అందించానని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు