హైదరాబాద్, ఆగస్టు 24 (జనవాణి): హైదరాబాద్‌లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారం మరోసారి కలకలం రేపింది. నగరంలోని చికెన్ షాపులు, మాంసం ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి భారీగా వ్యర్థాలను సేకరించి.. వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువులకు తరలిస్తున్న ముఠాను అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, పశువైద్య శాఖ అధికారులు సంయుక్తంగా అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీల్లో తరలిస్తున్న దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా చికెన్ షాపులు, ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వ్యర్థాలను సేకరించి.. లారీల్లో నింపి రాత్రివేళల్లో ఏపీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ చేపల చెరువుల యజమానులకు వీటిని విక్రయించి.. చేపలకు మేతగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ మొత్తంలో వ్యర్థాలు పట్టుబడటంతో ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. గత నెలలోనూ సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా ఉపయోగించడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కలుషితమైన వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. చికెన్ వ్యర్థాలను సేకరించడం, రవాణా చేయడం, చేపల చెరువులకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Loading Tweet...




















