కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. మేఘనను తమ కుటుంబంలో కూతురిలా చూసుకున్నామని చెప్పారు. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ తన కుటుంబంపై ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

24 ఆగస్టు, 2026 5:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నాం.. కుటుంబ వివాదంలో రాజకీయ జోక్యం ఉందంటూ జోగి రమేష్ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ తన కుటుంబంలో చోటుచేసుకున్న వివాదంపై స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య విభేదాలు ఉండొచ్చని, అయితే మేఘనను తాము ఎప్పుడూ సొంత కూతురిలానే చూసుకున్నామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వివాహం చేయడం తమ బాధ్యత అని, అదే బాధ్యతతో రాజీవ్‌కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని చెప్పారు.

మేఘన తమపై ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించిన జోగి రమేష్.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండొచ్చని, అయితే ఆ కారణంగా కుటుంబంలోని 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ తీసుకున్నామని తెలిపారు. కుటుంబ వ్యవహారాలపై కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానళ్లు గత నెల రోజులుగా అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయని జోగి రమేష్ మండిపడ్డారు. తమ కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని వ్యాపారంగా మార్చుకోవడం సరికాదని అన్నారు. తన భార్య మతపరమైన ఆచారాలు పాటించడంపై వచ్చిన ఆరోపణలపైనా జోగి రమేష్ స్పందించారు. బైబిల్ చదవడం, క్రైస్తవ బోధనలు వినడంతో పాటు తిరుమల, శ్రీశైలం, కనకదుర్గమ్మ ఆలయం, కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటామని చెప్పారు. హోమాల్లోనూ పాల్గొంటారని తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.

మేఘన చెప్పిన విషయాలను వక్రీకరించి ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏఐ వీడియోల ద్వారా తమ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. తన కోడలు మేఘన టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి వెళ్లినట్లు చెబుతున్న వీడియోను కూడా జోగి రమేష్ మీడియా ముందు ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తన కుటుంబంపై టీడీపీ, ఐటీడీపీ ద్వారా దుష్ప్రచారం జరుగుతోందని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను ఉద్దేశించి.. కుటుంబ సమస్యలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం న్యాయమా అని ప్రశ్నించారు. అదే సమయంలో రాజీవ్, మేఘన కలిసి ఉండాలన్నదే తన కోరిక అని జోగి రమేష్ స్పష్టం చేశారు. మేఘన తన కూతురితో సమానమని, తాము ఆమెను తల్లిదండ్రుల్లా చూసుకున్నామని పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు