నెల్లూరు, సెప్టెంబర్ 01 (జనవాణి): వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిని కొట్టింది నిజమేనని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ జరుగుతున్న సమయంలో రెస్ట్‌రూమ్‌లో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే అంశంపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని, మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లిందని చెప్పారు. ఈ విషయం చాలామంది వైసీపీ నేతలకు తెలుసని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి వైసీపీలో చాలా అవమానాలు జరిగాయని కోటంరెడ్డి ఆరోపించారు. ఆయన నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేసిన సమయంలో కూడా తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని అన్నారు.
సజ్జల దారుణంగా దూషించారు
విజయసాయిరెడ్డి తన సొంతూరు తాళ్లపూడికి వచ్చిన సమయంలో కాకుపల్లి సెంటర్‌లో సుమారు 100 వాహనాలతో ఘనంగా స్వాగతం పలికారని కోటంరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిని తీవ్రంగా దూషించారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను బయట చెప్పలేనంత దారుణంగా ఉన్నాయని అన్నారు. అమరావతి రైతులు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో తాను వారికి అండగా ఉంటానని చెప్పినందుకు కూడా సజ్జల తనను తప్పుబట్టారని కోటంరెడ్డి తెలిపారు.
విజయసాయిపై నాకు మంచి అభిప్రాయం లేదు
తన నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి నిర్వహించిన ఓ సమావేశంలో తనను తీవ్రంగా విమర్శించారని కోటంరెడ్డి చెప్పారు. అందుకే విజయసాయిరెడ్డిపై తనకు మంచి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు.
వైసీపీపై కోటంరెడ్డి విమర్శలు
వైసీపీ ఐదేళ్ల పాలన ప్రజావ్యతిరేకంగా సాగిందని కోటంరెడ్డి విమర్శించారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం చారిత్రకమైతే.. వైసీపీ ఎదుర్కొన్న ఓటమి కూడా చారిత్రకమేనన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించకుండా వైసీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆలయాల్లో రథాలు దగ్ధమైనప్పుడు, విగ్రహాలు ధ్వంసమైనప్పుడు వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తిరుపతి వేంకటేశ్వర ఛానెల్‌ను కూడా రాజకీయాలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కోటంరెడ్డి హెచ్చరించారు. అలాగే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నేతలు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.




















