e-KYC, ఆగస్టు 27 (జనవాణి): వంట గ్యాస్ (LPG) వినియోగదారులకు ఇది ముఖ్యమైన వార్త. గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ, సర్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని డొమెస్టిక్ LPG కనెక్షన్ల e-KYC గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు ఆగస్టు 23తో ముగియాల్సి ఉండగా.. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నెలాఖరు వరకు అవకాశం కల్పించారు.
e-KYC చేయకపోతే కనెక్షన్ కట్ అవుతుందా?
ఇదే చాలామంది LPG వినియోగదారుల సందేహం. ఆగస్టు 31లోపు e-KYC పూర్తి చేయకపోయినా గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు అవుతుందని భావించాల్సిన అవసరం లేదు. సాధారణంగా సిలిండర్ సరఫరా కొనసాగుతుంది. అయితే భవిష్యత్తులో సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనాల్సి రావచ్చు. అలాగే సిలిండర్ బుకింగ్, డెలివరీలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
e-KYC ఎందుకు చేస్తున్నారు?
గ్యాస్ కనెక్షన్లు నిజమైన వినియోగదారుల పేర్లపైనే ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడంతో పాటు, సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే e-KYC ప్రధాన ఉద్దేశం. ఇళ్లకు ఇచ్చే రాయితీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడం కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే సుమారు 82 శాతం మంది LPG వినియోగదారులు e-KYC పూర్తి చేసినట్లు సమాచారం.
ఇంట్లో నుంచే e-KYC ఎలా చేయాలి?
గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్ ద్వారా e-KYC పూర్తి చేయవచ్చు.
మీ గ్యాస్ కంపెనీకి చెందిన అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇండేన్ – IndianOil ONE
హెచ్‌పీ గ్యాస్ – HP Pay
భారత్ గ్యాస్ – Hello BPCL
Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి.
గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
ప్రొఫైల్‌లోకి వెళ్లి Re-KYC/e-KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆధార్ నంబర్ నమోదు చేసి సమ్మతి ఇవ్వండి.
మొబైల్ ఫ్రంట్ కెమెరాతో Face Authentication పూర్తి చేయండి.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ e-KYC పూర్తవుతుంది.
ఆఫ్‌లైన్‌లోనూ పూర్తి చేసుకోవచ్చు
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం రాని వారు లేదా Face Authenticationలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు తమ గ్యాస్ పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లవచ్చు. అక్కడ బయోమెట్రిక్ మిషన్ ద్వారా e-KYC అప్‌డేట్ చేసుకోవచ్చు. కాబట్టి చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా e-KYC పూర్తి చేసుకోవడం మంచిది.




















