ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 17 (జనవాణి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రధానికి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఎక్స్ వేదికగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘సేవ, సంకల్పం, సుశాసన్’.. చంద్రబాబు విషెస్
ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవ ప్రారంభించి, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు సాగిన ప్రస్థానాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. మోదీ 25 ఏళ్ల ఆదర్శప్రాయమైన ప్రజాసేవ భారతదేశ అభివృద్ధి ప్రస్థానానికి కొత్త ఊపునిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సేవ, సంకల్పం, సుశాసన్’ అనే మోదీ దార్శనికత కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. ప్రధాని మోదీకి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, సుసంపన్నమైన జీవితం కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో ఆయనకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Loading Tweet...
‘మీ నాయకత్వం దేశాన్ని బలపరిచింది’.. పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లోని వడ్నగర్‌లోని చిన్న ఇంటి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ ప్రస్థానం.. సంకల్పం, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
మోదీ నాయకత్వంలో అభివృద్ధి, స్వావలంబన, జాతీయ భద్రత, ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం లభించిందని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణతో పాటు భారతీయ రైల్వేల ఆధునీకరణ జరుగుతోందని తెలిపారు. డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు దేశీయ సామర్థ్యాలపై విశ్వాసాన్ని పెంచాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారత్‌కు అంకితమైన మోదీ జీవితం, 25 ఏళ్ల ప్రజాసేవ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రధాని మోదీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో దేశానికి సేవ చేసేందుకు నిరంతర శక్తిని పొందాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Loading Tweet...




















