న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో మొక్కజొన్న రైతులకు సంస్థాగత మద్దతు కల్పించేందుకు జాతీయ మొక్కజొన్న బోర్డు ఏర్పాటు చేయాలని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
భారతదేశంలో మొక్కజొన్న వ్యూహాత్మక పంటగా ఎదిగిందని బైరెడ్డి శబరి తెలిపారు. ఒకప్పుడు కేవలం ధాన్యంగా మాత్రమే భావించిన ఈ పంట ప్రస్తుతం ఆహారం, పశుగ్రాసం, ఇథనాల్ తయారీకి కీలకంగా మారిందన్నారు. వరి, గోధుమల తర్వాత దేశంలో మూడో అతిపెద్ద ధాన్య పంటగా మొక్కజొన్న నిలిచిందని, ఆహార భద్రతతో పాటు కోళ్ల పరిశ్రమ, పశుసంపద, ఇథనాల్ మిశ్రణ కార్యక్రమానికి ఇది ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. తక్కువ నీటితో సాగు చేయవచ్చని, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం కూడా మొక్కజొన్నకు ఉందన్నారు.
రాయలసీమ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగినప్పటికీ, వరి, గోధుమలకు ఉన్న స్థాయిలో సంస్థాగత మద్దతు ఈ పంటకు ఇంకా లభించడం లేదన్నారు.
హామీతో కూడిన కొనుగోలు కేంద్రాల కొరత, ధరల అస్థిరత, ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి, ఆహారం–పశుగ్రాసం–ఇథనాల్ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా తగిన కొనుగోలు మౌలిక వసతులు లేకపోవడంతో రైతులు తమ పంటను తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కజొన్నకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం కొనుగోలు జరిగేలా చూడడం, ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ధరలను స్థిరీకరించడం, వివిధ రంగాల్లో మొక్కజొన్న వినియోగాన్ని సమన్వయం చేయడం, మెట్ట భూములకు అనువైన రకాల అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో జాతీయ మొక్కజొన్న బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఇతర ప్రధాన పంటల రైతులకు అందుతున్న సంస్థాగత మద్దతును మొక్కజొన్న రైతులకు కూడా కల్పించాలని కోరారు.





















