న్యూఢిల్లీ, ఆగస్టు 7(జనవాణి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను నంద్యాల ఎంపీ, లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్‌సభలో ప్రస్తావించారు. జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.
జూన్‌లో రాష్ట్రంలో 25 శాతం వర్షపాతం లోటు నమోదైందని, జూలైలో అది 40 శాతానికి పైగా చేరిందని బైరెడ్డి శబరి తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ రుతుపవనాల కాలం మొత్తం 27 శాతం వర్షాభావంతో ముగిసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై తీవ్రంగా పడిందని, అనేక జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశముందని చెప్పారు.
313 మండలాల్లో కరువు ప్రభావం
తీవ్ర కరువు ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉన్న 105 మండలాలు, మోస్తరు కరువు ప్రభావం ఉండే 208 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని శబరి తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రూ.479.01 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. దీర్ఘకాలిక విపత్తు నివారణ ప్రాజెక్టులకు మరో రూ.521.17 కోట్లు కేటాయించామని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే లక్ష్యంతో 36 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారు రూ.35 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
భూగర్భ జలాల పునరుద్ధరణ, కరువును తట్టుకునే పంటలకు సాంకేతిక సహాయం, సూక్ష్మ సాగునీటి విధానాల విస్తరణ, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎంపీ కోరారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మధ్య కీలక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించిన శబరి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.





















