తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు నారా భువనేశ్వరి పలు గ్రామాల్లో పర్యటించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ప్రాధాన్యం
కుప్పం మండలం వసనాడులో మహిళలతో నిర్వహించిన సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల చదువుకు భారం తగ్గించేందుకు 'తల్లికి వందనం' వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
కుప్పానికి పరిశ్రమలు.. యువతకు అవకాశాలు
కుప్పం నియోజకవర్గానికి భారీ పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా సామర్థ్యంపై విశ్వాసంతో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు.
పెదబంగారుతనంలోని హార్టికల్చర్ హబ్‌ను సందర్శించిన సందర్భంగా మహిళా రైతులు అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులను ప్రశంసించారు. ఒక్క పంటపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపడితే రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజసిద్ధమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు విలువైన సూచనలు
వసనాడు జడ్పీ పాఠశాలను సందర్శించిన నారా భువనేశ్వరి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, మొక్కలు నాటే అలవాటు పెంచుకోవాలని సూచించారు.
గురువులను గౌరవించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జీవితంలో తనకు తల్లి, భర్త చంద్రబాబు నాయుడు ఎంతో ప్రేరణనిచ్చారని చెప్పారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతలు స్వీకరించేందుకు చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ (AI)ను అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.
టీడీపీ కార్యకర్తలే పార్టీ బలం
వేపూరు గ్రామంలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమైన భువనేశ్వరి, టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. 'నిజం గెలవాలి' యాత్ర సమయంలో కార్యకర్తలు తనకు అండగా నిలిచారని తెలిపారు. కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించిన ఘనత మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందని అన్నారు.
గ్రామాభివృద్ధికి నిధులు
వేపూరు పంచాయతీ అభివృద్ధి కోసం సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు, గోకులం షెడ్ల నిర్మాణం, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 150 ఇళ్ల మంజూరు, ఎన్టీఆర్ సుజల కింద వాటర్ ట్యాంకులు, జడ్పీ పాఠశాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు భువనేశ్వరి తెలిపారు. అలాగే 'తల్లికి వందనం', పింఛన్లు, ఆలయ అభివృద్ధి వంటి పథకాల ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని పేర్కొన్నారు.




















