భద్రాచలం/రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. గోదావరిలో బోట్ల రాకపోకలకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అన్ని బోటు సేవలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే వరకు పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు రావొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నదిలో వరద ప్రవాహం తగ్గిన తర్వాత పరిస్థితిని సమీక్షించి బోటు సేవలను పునఃప్రారంభిస్తామని వెల్లడించారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం 16 అడుగులుగా నమోదైన గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 27 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి ఉద్ధృతి కారణంగా భద్రాచలం స్నానఘట్టాల వద్ద మెట్ల వరకు వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చర్ల మండలంలోని తాళిపేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.




















