ఆమలాపురం, సెప్టెంబర్ 02 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అమలాపురంలోని ఓ కాలేజీ సమీపంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు.
అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంక గ్రామానికి చెందిన రొళ్ల ప్రేమ్ కుమార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయన.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి వేడుకల్లో భాగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న బీజేపీ, జనసేన నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రేమ్ కుమార్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ నివాళి
విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన జనసైనికుడు ప్రేమ్ కుమార్‌కు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అమలాపురం రానున్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించడంతో పాటు జనసేన పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. మరోవైపు ప్రేమ్ కుమార్ ఆకస్మిక మృతికి చింతిస్తూ బుధవారం జరగాల్సిన పలు కార్యక్రమాలను జనసేన నాయకులు, జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు రద్దు చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటన అభిమానుల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది.




















