భోగాపురం, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణలో మోదీ పాత్ర కీలకమని కొనియాడారు.
శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని అన్నారు. దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా నడిపిస్తూ "వికసిత్ భారత్" లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో నిమగ్నమవుతున్న నాయకుడు అని కొనియాడారు. తనను విమర్శించినవారిని, దూషించిన వారిని కూడా క్షమించే గొప్ప మనస్తత్వం మోదీదని పవన్ కల్యాణ్ అన్నారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ.. "తెలుగువారు ఎవరికీ తలవంచరు" అని అల్లూరి సీతారామరాజు చెప్పిన స్ఫూర్తిని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని, పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల విస్తరణ ఎంత ముఖ్యమో ప్రధాని మోదీ బాగా అర్థం చేసుకున్నారని, అదే దిశగా విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.




















