కనకదుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మంత్రి ఆనం ప్రకటన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న సాయంత్రం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. 14, 15 తేదీల్లో ఆమె విజయవాడలో ఉండనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

6 అక్టోబర్, 2026 9:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కనకదుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మంత్రి ఆనం ప్రకటన

విజయవాడ, అక్టోబర్ 6 (జనవాణి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 14, 15 తేదీల్లో రాష్ట్రపతి విజయవాడలో ఉండనున్నట్లు వెల్లడించారు.

దసరా ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 16న మూల నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సరస్ ఉత్సవాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విజయవాడకు రానున్నారని, వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.

25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ఈసారి దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 2.5 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కొండచరియలను తొలగించి తాత్కాలికంగా భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. రైల్వే స్థలాన్ని హోల్డింగ్ ఏరియాగా వినియోగించుకునేందుకు కేటాయించారని వెల్లడించారు.

2.5 కిలోమీటర్ల క్యూలైన్

హోల్డింగ్ ఏరియా నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు పాలు, తాగునీరు, బిస్కెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హోల్డింగ్ ఏరియాలో ప్రసాదం పంపిణీ కూడా ఉంటుందని వెల్లడించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా అన్ని మార్గాలను అనుసంధానం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 తర్వాత భవానీ మాలధారులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు

సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు వచ్చిన సమయంలో మాత్రమే కొద్దిసేపు సామాన్య భక్తుల దర్శనాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అంతరాలయ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయం, సాయంత్రం 2 గంటల 45 నిమిషాల పాటు వీఐపీ దర్శనాలు ఉంటాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు