రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు

కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉపాధి.

24 ఆగస్టు, 2026 3:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు

అనంతపురం, ఆగస్టు 24 (జనవాణి): ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. రాయలసీమలో పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కియా పరిశ్రమతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలోకి తాజాగా మరో భారీ పెట్టుబడి రాబోతోంది. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ రాయదుర్గం నియోజకవర్గంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త విండ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైంది.

1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులు

కణేకల్లు మండలం హులికెర గ్రామంలో సుజ్లాన్ ఏర్పాటు చేస్తున్న S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్‌ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ విస్తరణలో భాగంగా 1,325 మెగావాట్ల సామర్థ్యంతో విండ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఏపీలో సుజ్లాన్‌కు బలమైన పునాది

సుజ్లాన్ 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యంతో కీలక పవన విద్యుత్ సంస్థగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంస్థ సుమారు 2,200 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉరవకొండ నియోజకవర్గంలోని ఇప్పూరులో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది.

2030 నాటికి మరో 5,000 మెగావాట్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి అదనంగా 5,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సుజ్లాన్ లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమల విస్తరణతో పాటు గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను కూడా సంస్థ నిర్వహిస్తోంది. ఉరవకొండ, విజయవాడలోని శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 12,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. వీరిలో 25 శాతం మంది మహిళలు ఉండటం విశేషం.

దేశీయ విండ్ మార్కెట్‌లో 33 శాతం వాటా

దేశీయ పవన విద్యుత్ మార్కెట్‌లో సుజ్లాన్‌కు సుమారు 33 శాతం వాటా ఉన్నట్లు సంస్థ పేర్కొంటోంది. దేశంలో ఏర్పాటు చేసిన ప్రతి మూడు విండ్ టర్బైన్లలో ఒకటి సుజ్లాన్ తయారు చేసిందే కావడం సంస్థ స్థాయిని తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించిన తొలి భారతీయ కంపెనీగా కూడా సుజ్లాన్ గుర్తింపు పొందింది. రాయదుర్గం కేంద్రంగా తాజా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు అమల్లోకి వస్తే అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగం మరింత బలోపేతం కావడంతో పాటు స్థానికంగా ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు