రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

31 జులై, 2026 8:30 AM•ByLaharika

Share this article

రూ.5,750 కోట్ల టాటా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక: మంత్రి నారా లోకేష్

కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రూ.5,750 కోట్లతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, EQT, TPG వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో పాటు టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ACME, వారీ వంటి ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరగడం పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

విశ్వాసాన్ని తిరిగి సాధించాం

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వంటి చర్యల వల్ల పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై నమ్మకం దెబ్బతిందని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం స్థిరమైన విధానాలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చిందన్నారు.

160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యం

ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 ద్వారా 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. సోలార్, విండ్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ట్రాన్స్‌మిషన్, స్టోరేజ్ వంటి మొత్తం క్లీన్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లోనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

4 వేల ఉద్యోగాలు.. 1,100 రైతు కుటుంబాలకు ఆదాయం

టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కింద పత్తికొండలో 400 మెగావాట్ల సోలార్, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. 3,400 ఎకరాలకు పైగా విస్తరించే ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని, 1,100కుపైగా రైతు కుటుంబాలకు సుమారు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయం అందుతుందని వివరించారు.

విదేశాలకు క్లీన్ ఎనర్జీ ఎగుమతులే లక్ష్యం

పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా ఉన్న పునరుత్పాదక వనరులు, ప్రపంచ స్థాయి పోర్టులతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి స్వచ్ఛ ఇంధన ఉత్పత్తులు యూరప్, జపాన్, కొరియా తదితర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

టాటా, సుజ్లాన్‌తో భాగస్వామ్యం

టాటా గ్రూప్‌తో రాష్ట్రానికి దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేసిన మంత్రి, ప్రభుత్వం 'సింపుల్, స్పీడ్, స్టెబిలిటీ' విధానంతో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తోందన్నారు. అలాగే అనంతపురంలో విండ్ టర్బైన్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సుజ్లాన్ సంస్థను అభినందిస్తూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.

ఐటీఐలకు ఇండస్ట్రీ అనుసంధానం

రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ఒక్కో ఐటీఐని ఒక్కో కంపెనీతో అనుసంధానం చేసి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన "లెర్న్–ఎర్న్–గ్రాడ్యుయేట్" విధానంలో నడిచే విశ్వవిద్యాలయం ద్వారా చదువుకుంటూనే సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

పత్తికొండ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు

పాదయాత్ర సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు చూపిన ఆదరణను ఎప్పటికీ మరువలేనని లోకేష్ అన్నారు. పత్తికొండతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని చెప్పారు. పరిశ్రమలు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అయితే, వాటిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవడం వారి బాధ్యత అని సూచించారు.

అంతకుముందు పత్తికొండకు వెళ్తున్న మార్గంలో రోడ్డు పక్కన శనక్కాయలు విక్రయిస్తున్న రేకంద విజయను మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె వద్ద నుంచి వేరుశెనక్కాయలు కొనుగోలు చేసి, ఆమె కుటుంబ పరిస్థితులు, సమస్యలు తెలుసుకోవాలని తన సిబ్బందిని ప్రత్యేకంగా ఆదేశించారు. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో టాటా పవర్ సీఈఓ & ఎండీ ప్రవీర్ సిన్హా, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఈఓ & ఎండీ సంజయ్ బంగా, సుజ్లాన్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి, భారీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కేఈ శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు