తిరుమల,సెప్టెంబర్ 26 (జనవాణి): తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో వ్యక్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మధురైకి చెందిన 52 ఏళ్ల మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావును తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. రాంభగీచ గెస్ట్‌హౌస్ సమీపంలో టీటీడీ ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగతనాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మురుగన్ భక్తులను మోసం చేసేందుకు నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ టీటీడీ, ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డులు
తిరుమలకు వచ్చే భక్తుల నమ్మకాన్ని పొందేందుకు మురుగన్ నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేందుకు నకిలీ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి ఐడీ కార్డు కూడా ఉపయోగించినట్లు గుర్తించారు. మురుగన్ వద్ద నుంచి నకిలీ టీటీడీ ఎంప్లాయీ ఐడీ కార్డు, చెన్నై ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డు, రెండు సెల్‌ఫోన్లు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాంగళ్య పూజ పేరుతో భక్తులకు టార్గెట్
మాంగళ్య పూజ పేరుతో అమాయక భక్తులను నమ్మించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును కాజేసేందుకు మురుగన్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహా మోసాలకు సంబంధించి అతడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు తెలిపారు. మాంగళ్య పూజ పేరుతో మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మురుగన్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నకిలీ గుర్తింపు కార్డుల తయారీ, గత నేరాలు, ఇతర మోసాలతో అతడికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
భక్తులు అప్రమత్తంగా ఉండాలి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులు, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తూ నమ్మించే ప్రయత్నం చేస్తే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే తిరుమల పోలీసులకు లేదా విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.




















