తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు 23 నుంచి పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

12 ఆగస్టు, 2026 3:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు 23 నుంచి పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు

తిరుమల, ఆగస్టు 12 (జనవాణి): తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి తిరుమల దేవస్థానం(TTD) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఉత్సవాలకు ఆగస్టు 22న అంకురార్పణ జరగనుంది.

పవిత్రోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు?

ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో నిత్య అర్చనలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో భక్తులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరిగే అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది. వాటి ప్రభావం ఆలయ పవిత్రతపై పడకుండా ఆగమశాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో 15-16వ శతాబ్దాల వరకు ఈ ఉత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని టీటీడీ పేర్కొంది. అనంతరం 1962లో దేవస్థానం పవిత్రోత్సవాలను పునరుద్ధరించినట్లు తెలిపింది.

మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆగస్టు 23: పవిత్రాల ప్రతిష్ట

ఆగస్టు 24: పవిత్ర సమర్పణ

ఆగస్టు 25: పూర్ణాహుతి

పలు ఆర్జిత సేవలు రద్దు

పవిత్రోత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 22న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ రద్దు కానుంది. అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు 25న అష్టదళ పాదపద్మారాధన సేవ, ఆగస్టు 26న (పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజు) కల్యాణోత్సవ సేవ కూడా రద్దు కానున్నాయి.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టు 11న 78,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,014 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.46 కోట్ల ఆదాయం సమకూరింది. అదే రోజు సుమారు 4 లక్షల లడ్డూలు విక్రయమైనట్లు సమాచారం. బుధవారం ఉదయం అందిన సమాచారం ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎస్‌ఎస్‌డీ (SSD) టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు