బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు.. తిరుమలలో తొలిసారి భక్తులకు ఇన్సూరెన్స్‌

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులు, ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైనా పాలకమండలి చర్చించింది.

9 సెప్టెంబర్, 2026 5:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు.. తిరుమలలో తొలిసారి భక్తులకు ఇన్సూరెన్స్‌

తిరుమల,సెప్టెంబర్ 9 (జనవాణి): భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా ఎల్‌ఐసీ ద్వారా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించనుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు సహజ మరణం సంభవించినా రూ.2 లక్షల బీమా పరిహారం అందించేలా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎల్‌ఐసీకి టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో సహజ మరణానికి కూడా రూ.2 లక్షల సాయం అందించే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టీటీడీ ఛైర్మన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 14న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు జరగనున్నాయి.

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనాలు

CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు EHF సౌకర్యం కల్పించేందుకు రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించింది. టీటీడీ ఈహెచ్‌ఎఫ్‌ పథకం కింద మే నుంచి జూలై 2026 మధ్య రూ.5 లక్షలకు పైగా వైద్య ఖర్చులు చేసిన 15 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మొత్తం రూ.54.66 లక్షల రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయనున్నారు.

లడ్డూ తయారీకి అదనపు సిబ్బంది

శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

తిరుమల పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి రవాణా ఛార్జీలు చెల్లించేందుకు మూడేళ్లకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎఫ్‌ఎంఎస్‌లో పనిచేసిన కార్మికులకు లడ్డూ, వడ అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్‌

తిరుమల అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభజించి హైడ్రాలిక్‌ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్‌ తయారు చేయనున్నారు. ఈ బయోగ్యాస్‌ను టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసే ప్రాజెక్టు నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు.

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం లభించింది. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లకు ఆమోదం తెలిపారు.

తిరుపతిలోని తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును 2026 నవంబర్‌ 2 నుంచి 2029 నవంబర్‌ 1 వరకు మరో మూడేళ్లు పొడిగించేందుకు నిర్ణయించారు.

తిరుపతి అభివృద్ధికి రూ.7.56 కోట్లు

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మంజూరు చేసిన రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా రెండో విడతగా రూ.7.56 కోట్లు విడుదల చేసేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. మిగిలిన మొత్తాన్ని పనుల పురోగతి, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్ల ఆధారంగా విడతల వారీగా విడుదల చేయనున్నారు. దాతల సౌకర్యార్థం నామినీల మార్పుకు మరింత వెసులుబాటు కల్పించేలా విధాన సవరణకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. భక్తులు, ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమంతో పాటు తిరుమల మౌలిక వసతులు, పారిశుధ్యం, ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు