రాఖీ పండుగ రోజే ఘోర విషాదం.. భార్య, ఇద్దరు పిల్లలతో ఆటో డ్రైవర్ బలవన్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో రాఖీ పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో.. వినోద్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

29 ఆగస్టు, 2026 1:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రాఖీ పండుగ రోజే ఘోర విషాదం.. భార్య, ఇద్దరు పిల్లలతో ఆటో డ్రైవర్ బలవన్మరణం

విశాఖపట్నం జిల్లా, ఆగస్టు 29 (జనవాణి): విశాఖపట్నం జిల్లాలో రాఖీ పర్వదినాన జరిగిన విషాద ఘటన అందరినీ కలచివేసింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొత్తవలసకు చెందిన మల్లా వినోద్ కుమార్ కొంతకాలంగా పెందుర్తిలోని చింతలగ్రహారం కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

రాఖీ రోజంతా ఆనందంగా గడిపిన కుటుంబం

రాఖీ పండుగ సందర్భంగా వినోద్ కుమార్ తన భార్య, పిల్లలతో సంతోషంగా గడిపాడు. తనకు చెల్లెలి వరుస అయ్యే వారితో రాఖీ కట్టించుకుని ఆనందించాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో రోజంతా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వినోద్ కుమార్ కొందరు కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ మెసేజ్ పంపినట్లు సమాచారం. అనంతరం ఇంట్లో కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

భార్య, పిల్లలకు విషమిచ్చి.. ఆపై తానూ?

సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వినోద్ కుమార్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు.. ముందుగా భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపిన అనంతరం వినోద్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

అసలు కారణమేంటి?

ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాఖీ పండుగ రోజంతా తమతో ఆనందంగా గడిపిన కుటుంబం.. కొన్ని గంటల్లోనే ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం ఏంటని వారు విషాదంలో మునిగిపోయారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు