విశాఖలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి మృతికి అసలు కారణమేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20 ఆగస్టు, 2026 5:25 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విశాఖలో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి

విశాఖపట్నం, ఆగస్టు 20 (జనవాణి): విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్స్ స్కూలులో ఆరేళ్ల విద్యార్థి ప్రణయ్ తేజ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. యూకేజీలో చదువుతున్న చిన్నారి గురువారం ఉదయం సుమారు 11.20 గంటల సమయంలో క్లాస్‌రూమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే మరో టీచర్ చిన్నారికి సీపీఆర్ చేసి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఈసీజీ సహా పలు పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడా?

మరోవైపు, హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ తమ కుమారుడిని కొట్టారని.. ఆ ఘటనతో భయపడిపోయిన చిన్నారి కుప్పకూలి మృతి చెందాడని ప్రణయ్ తేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కేజీహెచ్‌ వద్ద, పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజీ

ఈ ఘటనకు సంబంధించిన క్లాస్‌రూమ్ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ మహిళా టీచర్ విద్యార్థుల హోం వర్క్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రణయ్ తేజ టీచర్ వద్దకు వెళ్లే సమయంలో ఏడుస్తూ, వద్దు వద్దు అంటూ వేడుకుంటున్నట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. ఆ తర్వాత టీచర్ చిన్నారి యూనిఫాంను సరిచేసి, చెంపపై కొట్టినట్లు దృశ్యాలు ఉన్నాయి. వెంటనే ప్రణయ్ తేజ ముందుకు ఒరిగి టీచర్‌పై పడిపోవడం.. టీచర్ అతడిని నిలబెట్టేందుకు ప్రయత్నించడం కూడా సీసీటీవీలో నమోదైనట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు

చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీచర్ కొట్టిన ఘటనకు, విద్యార్థి మృతికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేక చిన్నారికి అంతర్గతంగా ఏదైనా అనారోగ్య సమస్య ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం, వైద్య నివేదికలు, సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే మృతికి అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు