కడప, ఆగస్టు 21 (జనవాణి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, పులివెందుల్లోని అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అవినాశ్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో లభించే డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న పలువురి ఇళ్లలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పులివెందుల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే పులివెందుల్లో జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేర్వేరు బృందాలుగా ఏర్పడిన అధికారులు ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




















