కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. సంగాల, నేమకల్లులో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో విరూపాక్షితో సహా 15 మందిపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేసి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. అక్కడ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు.
అసలేం జరిగిందంటే..
చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త గిరిని ఫోన్‌లో వ్యక్తిగత దూషణకు పాల్పడ్డాడు. ఈ వివాదం కాస్త ముదిరి ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీంతో సంగాల గిరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్ తలకు తీవ్రగాయమవ్వగా.. నాగరాజు స్వల్పంగా గాయపడ్డారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు ఎడమ చేతికి గాయమైంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 2.45 గంటల సమయంలో భారీ పోలీసులు మోహరించి ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 15 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.





















