అమరావతి, ఆగస్టు 12 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలోని వైసీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అసెంబ్లీకి ఎమ్మెల్యేలు దూరం
వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుందని... ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేయగలిగింది పెద్దగా ఏమీ లేదని జగన్ వ్యాఖ్యానించారు. సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై ఆధారాలు, సాక్ష్యాలతో తాను మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు మరో కోణాన్ని వివరిస్తానని తెలిపారు.
మండలిలో గట్టిగా పోరాడాలి
అసెంబ్లీకి భిన్నంగా శాసనమండలిలో వైసీపీకి బలం ఉన్నందున అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పార్టీ ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చే హామీలు, విధానాలు, ప్రజా సమస్యలు, ఆర్థిక అంశాలపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించారు.
డీఎస్సీ వ్యవహారంపై జగన్ ఫోకస్
డీఎస్సీ లీకేజీలు, అక్రమాలపై వైసీపీ గత 74 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిందని జగన్ తెలిపారు. డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జగన్ పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆరోపణలు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. 13 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.9,100 కోట్లు బకాయి ఉన్నాయని, వసతి దీవెన కింద మరో రూ.3,300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రెండు పథకాలకు కలిపి సుమారు రూ.12,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,900 కోట్లు మాత్రమే చెల్లించిందని జగన్ ఆరోపించారు. ఈ అంశంపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ ఎమ్మెల్సీలకు సూచించారు.
రైతుల సమస్యలపైనా పోరాటం
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ అన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపిస్తూ.. రైతుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీపీపీ పాలసీపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రజా సేవలను కూడా పీపీపీ పరిధిలోకి తీసుకురావడం సరికాదని అన్నారు. అన్నీ ప్రైవేటుకే అప్పగిస్తే ఇక ప్రభుత్వం ఉండేది ఎందుకు?, ప్రభుత్వం ఉండేది కేవలం స్కాంలు చేసి లూటీ చేయడానికా? అని జగన్ ప్రశ్నించారు.




















