అమరావతి, ఆగస్టు 12 (జనవాణి): ‘‘వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు.. ఇది అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కాదు.. అప్పుల ఆంధ్రప్రదేశ్’’ అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు సాధించిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సొంత డబ్బా కొట్టుకోవడమేనని విమర్శించారు. వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
దేశ సగటు కంటే అధికంగా ఉన్న నిరుద్యోగం, రైతుల కష్టాల్లోనే ఈ వృద్ధిరేటు కనిపిస్తోందా? అని షర్మిల ప్రశ్నించారు. అరటి, మామిడి, టమాటా, కోకో, పత్తి, పొగాకు వంటి పంటలకు గత రెండేళ్లుగా సరైన మద్దతు ధర, ప్రభుత్వ సహకారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల పంటలు, వారి బతుకులు రోడ్డున పడితే.. వారి కన్నీటిలో వృద్ధిరేటు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో హత్యలు, మహిళలపై దాడులు, మద్యం, గంజాయి మత్తులో నేరాలు పెరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. చివరకు పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వృద్ధిరేటు అంటూ గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.5 మీటర్లకు పరిమితం చేసి, దాన్ని ఘన విజయంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని షర్మిల విమర్శించారు. భవిష్యత్తులో ఆ ఎత్తుతో ప్రయోజనం ఎంత ఉంటుందో తెలిసినా రైతులను ముంచే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
విద్యుత్ ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. ట్రూ-అప్ పేరుతో విద్యుత్ ధరలు తగ్గించామని చెబుతూనే.. మరోవైపు పాత చార్జీల భారాన్ని పేద ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు.
గత రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా భూమిపైకి వచ్చాయి, వాటికి భూమి, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలని షర్మిల డిమాండ్ చేశారు. పెట్టుబడులపై పూర్తి వివరాలు ఇవ్వకుండా పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా షర్మిల ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు.. విద్యార్థుల ఉద్యమాలు, వారి సమస్యలపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా నిలబడలేని ప్రభుత్వానికి ఏం వృద్ధి సాధించిందని ప్రశ్నించారు.
ఇవన్నీ తమ రాజకీయ విమర్శలు మాత్రమే కాదని, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలని వైఎస్ షర్మిల అన్నారు. వృద్ధిరేటుపై గొప్పలు చెప్పుకోవడం కాకుండా కూటమి ప్రభుత్వం వాస్తవ పరిస్థితులపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వృద్ధి, అభివృద్ధి పరిస్థితులపై ప్రజలకు స్పష్టమైన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.





















