దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమాన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విమానాన్ని బెన్ గురియన్ విమానాశ్రయంలో కూల్చివేయాలని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి భావించినట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు హీబ్రూ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
పైలట్‌ను హతమార్చిన తర్వాతే ప్లాన్ అమలు చేయాలని..
హీబ్రూ మీడియా కథనాల ప్రకారం.. ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను హతమార్చిన తర్వాత విమానాన్ని యథావిధిగా కొనసాగించాలని అల్-హమ్మామి భావించినట్టు తెలుస్తోంది. బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అవసరమైన అనుమతులు పొందిన అనంతరం చివరి క్షణంలో విమానాన్ని అక్కడి భవనం లేదా జెట్‌పై ఢీకొట్టాలని అతడు ప్రణాళిక వేసినట్టు సమాచారం. ఏం జరుగుతుందో ఎవరికీ అనుమానం రాకుండా చివరి వరకు వేచి ఉండాలని భావించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. విమానం జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించే వరకు కాక్‌పిట్ నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికి వేచి ఉన్నట్టు తెలుస్తోంది.
కో-పైలట్ ప్రయత్నాన్ని అడ్డుకున్న పైలట్
సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్.. కో-పైలట్ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించినట్టు సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కలిసి అల్-హమ్మామిని అదుపులోకి తీసుకుని కట్టివేశారు. అదే సమయంలో విమానంలో ఆఫ్-డ్యూటీలో ఉన్న ఇద్దరు పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కో-పైలట్ అనుకున్న ప్రణాళిక విఫలమైంది.
గాయపడిన పైలట్‌కు ప్రయాణికుడి చికిత్స
ఈ ఘటనలో ప్రయాణికుడిగా ఉన్న డెంటిస్ట్ ముసయేవ్ షోటా కూడా కీలకంగా వ్యవహరించారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు విమానం గాల్లో ఉండగానే ప్రాథమిక చికిత్స అందించారు. పైలట్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిందని షోటా తెలిపారు. విమానంలో తాను ఒక్కరే వైద్య నిపుణుడిగా ఉండటంతో వెంటనే స్పందించి రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు.
హమామ్ అల్-హమ్మామిపై గతంలోనూ భద్రతా ఆందోళనలు
ఇక కో-పైలట్‌ను ఒమన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మామిగా గుర్తించినట్టు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ఒమన్ ఎయిర్‌లో పనిచేసిన అల్-హమ్మామిని భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో 2024లో విమానాలు నడపకుండా సస్పెండ్ చేసినట్టు సమాచారం. అతను కో-పైలట్ ట్రైనీగా పనిచేస్తున్న సమయంలో తీవ్రవాద సామగ్రి ఉన్నట్లు గుర్తించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అనంతరం అతడిని ఒమన్ ఎయిర్‌లో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల్లో కొనసాగించేందుకు అనుమతించినప్పటికీ తీవ్రవాద భావజాలానికి సంబంధించిన ఆందోళనల కారణంగా విమానాలు నడపకుండా నిలిపివేసినట్టు తెలుస్తోంది.




















