భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో కోట్లాది మంది పాలసీదారులు ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం లక్షల్లో, కోట్లల్లో ప్రీమియం చెల్లిస్తుంటారు. అయితే ఆ ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసీ ఎలా వినియోగిస్తుంది? ఎక్కడ పెట్టుబడులు పెడుతుంది? అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమాధానం ఇచ్చింది.
లోక్‌సభ సభ్యుడు రాజీవ్ రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో లిస్టెడ్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల పరిమాణం మారుతూ వచ్చిందని, సంస్థ స్వతంత్ర పెట్టుబడి విధానం, బోర్డు ఆమోదించిన ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.
షేర్ల ఎంపిక ఎలా?
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఎల్ఐసీ పలు కీలక అంశాలను పరిశీలిస్తుందని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా..కంపెనీ ఆర్థిక పనితీరు, భవిష్యత్ వృద్ధి అవకాశాలు, వ్యాపార సామర్థ్యం, సంస్థ ఫండమెంటల్స్, రిస్క్ అంచనాలు, పెట్టుబడి భద్రత వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పంకజ్ చౌదరీ వెల్లడించారు.
SOP ప్రకారమే పెట్టుబడులు
ఎల్ఐసీ ఇప్పటికే అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారమే పెట్టుబడులు పెడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎలాంటి కంపెనీల్లో ఎంత మేర పెట్టుబడులు పెట్టిందనే వివరాలను బహిర్గతం చేయబోమని వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరిగా ఉన్న ఎల్ఐసీ, పాలసీదారుల నిధులను భద్రత, స్థిరమైన రాబడి, దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి చేస్తోందని కేంద్రం పేర్కొంది.




















