హైదరాబాద్, ఆగస్టు 27 (జనవాణి): ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం వ్యక్తం చేసింది.
రంగస్థలం నుంచి సినీ ప్రయాణం
కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవీ నారాయణ రావు బాల్యం, విద్యాభ్యాసాన్ని గుంతకల్లులో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన భరతనాట్యం, కూచిపూడి, నటనలో శిక్షణ పొందారు. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్. కృష్ణ వద్ద నటన అభ్యసించారు. చదువుకునే రోజుల్లోనే ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయం’, ‘మంచుతెర’ తదితర నాటకాల్లో నటించారు. ఆ సమయంలో కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి ప్రముఖులతో ఆయనకు రంగస్థల పరిచయం ఏర్పడింది.
‘అంతులేని కథ’తో సినీ రంగ ప్రవేశం
1976లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ చిత్రంతో జీవీ నారాయణ రావు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ పొందిన ఆయన.. ఆ తర్వాత పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘చట్టానికి కళ్లులేవు’, ‘రాజా విక్రమార్క’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’, ‘సాహసం’, ‘స్కైలాబ్’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆలోచన’ విడుదల కావాల్సి ఉంది. జీవీ నారాయణ రావుకు రజనీకాంత్, చిరంజీవితో మంచి స్నేహబంధం ఉండేది.

నటుడిగానే కాదు.. నిర్మాతగానూ
జీవీ నారాయణ రావు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లినీకూ శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు. పలు టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రంగస్థల కళాకారుడిగా కెరీర్ ప్రారంభించి.. సినిమాలు, టెలివిజన్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగించిన జీవీ నారాయణ రావు ఇక లేరనే వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




















