మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రత్యేక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బన్నీ తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగపూరితంగా స్పందించారు. 'మా ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా అందరికీ ఆయనే కొండంత అండ. మాలో ప్రతి ఒక్కరినీ వెన్నుతట్టి ప్రోత్సహించి ఉన్నత స్థాయికి చేర్చిన గొప్ప స్ఫూర్తిప్రదాత' అంటూ పేర్కొన్నారు. చిరంజీవి తనతో పాటు ఎంతోమందికి అందించిన ప్రోత్సాహం, స్ఫూర్తిని ఈ సందర్భంగా బన్నీ గుర్తుచేసుకున్నారు. మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరి ఎదుగుదల వెనుక చిరంజీవి ప్రోత్సాహం ఎంతో ఉందనే భావాన్ని తన పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు.
అయితే ఈ పోస్టులో బన్నీ జోడించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ ప్రత్యేకంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి 'కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్‌నే' అనే అర్థాన్ని అభిమానులు చెబుతున్నారు. గతంలోనూ పలు సినిమా వేడుకలు, బహిరంగ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ఈ మాటలను ప్రస్తావిస్తూ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నతనం నుంచే చిరంజీవి సినిమాలు, ఆయన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తాను ఎంతో ఆకర్షితుడినని బన్నీ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరోసారి తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకోవడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Loading Tweet...




















