'జన నాయకుడు' ఫ్లాప్ ఎఫెక్ట్.. 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసొచ్చిందా?

రివ్యూలు మిశ్రమంగా వచ్చినా.. ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రం 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసి వస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఆరంభాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

26 జులై, 2026 11:10 AM•ByLaharika

Share this article

'జన నాయకుడు' ఫ్లాప్ ఎఫెక్ట్.. 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసొచ్చిందా?

హైదరాబాద్: కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ సంకేతాలు ఇచ్చింది. సినిమా గురించి వచ్చిన టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సెకండ్ హాఫ్ విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు కనిపించినప్పటికీ, మొత్తం మీద సినిమా ఒకసారి తప్పకుండా చూడొచ్చనే స్పందన వినిపిస్తోంది.

సినిమాపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. గ్లింప్స్, 'గుర్తుందా గుర్తుందా' పాట, టీజర్, ట్రైలర్‌లకు వచ్చిన స్పందనతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అదే ఉత్సాహం పేయిడ్ ప్రీమియర్లలో కూడా కనిపించింది.

ప్రీమియర్లకే భారీ స్పందన రావడంతో, రూ.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. దీంతో సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయింది.

ఇక విడుదలైన తొలి రోజు విషయానికి వస్తే.. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు రెగ్యులర్ షోల ద్వారా సుమారు రూ.8 కోట్లకు పైగా గ్రాస్, దాదాపు రూ.5 కోట్ల షేర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ట్రేడ్ అంచనాలపై అధికారికంగా ధృవీకరించలేదు.

కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే ఈ ఓపెనింగ్ మెరుగ్గా ఉండటంతో, ఆయన మార్కెట్ మళ్లీ పుంజుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.16 కోట్ల షేర్ అవసరమని సమాచారం. ఇప్పటికే తొలి రోజు మంచి వసూళ్లు రావడంతో మిగిలిన మొత్తాన్ని వీకెండ్‌లోనే రాబట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వారంలో విడుదలైన ఇతర సినిమాలకు ఆశించిన స్పందన రాకపోవడం కూడా 'చెన్నై లవ్ స్టోరీ'కి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమా కథ ఏంటి?

స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) సినీ నటుడిగా తన పేరు వెండితెరపై చూసుకోవాలని కలలు కనే యువకుడు. ఆ కలతో చెన్నై చేరుకుంటాడు. అక్కడే నివేదిత (గౌరీ ప్రియ) పరిచయం అవుతుంది. గత ప్రేమ విఫలమై తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఆమెను మామూలు జీవితంలోకి తీసుకురావడానికి స్టీవెన్ చేసే ప్రయత్నాలు కథను ముందుకు నడిపిస్తాయి.

ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఎలాంటి మలుపులు తిరిగింది? నివేదిత జీవితంలో స్టీవెన్ ఏ మార్పు తీసుకొచ్చాడు? చివరికి ఆమె ప్రేమను అంగీకరించిందా? అలాగే హీరో సినీ నటుడిగా ఎదగాలన్న తన కలను నెరవేర్చుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే 'చెన్నై లవ్ స్టోరీ'ను వెండితెరపై చూడాల్సిందే.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు