రక్తం అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు.. విమర్శలపై చిరు క్లారిటీ

బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం విక్రయిస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాల ద్వారా వస్తున్న తన సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు సూచించారు.

22 సెప్టెంబర్, 2026 2:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రక్తం అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు.. విమర్శలపై చిరు క్లారిటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తన జీవిత ప్రయాణంలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇటీవల ‘మెగా యూత్ ఫోర్స్’ పేరుతో అభిమానులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

సేవా దృక్పథంతో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తే, రక్తాన్ని అమ్ముకుంటున్నారంటూ తనపై కొందరు ఆరోపణలు చేశారని చిరంజీవి తెలిపారు. అయితే అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.

సినిమాలు చేస్తే నాకు కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంది. ఆ సంపాదన నాకు చాలు. రక్తం అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం నేను ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోలేదు. ఎవరి ముందు చేయి చాచలేదు. నా కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నడుపుతున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటానని ఆయన చెప్పారు. విచక్షణ లేకుండా చేసే విమర్శలు తనను బాధించవని, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.

డబ్బు పోతే సంపాదించొచ్చు.. సమయం తిరిగి రాదు

తన దృష్టిలో జీవితంలో అన్నింటికంటే సమయమే విలువైనదని చిరంజీవి అన్నారు. డబ్బు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చని, కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేమని చెప్పారు. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభిమానులు తనను కేవలం అభిమానించడం, ప్రేమించడం మాత్రమే కాకుండా తాను ఎలా ఎదిగానో తెలుసుకోవాలని చిరంజీవి అన్నారు. జీవితంలో పైకి రావడానికి తాను పాటించిన క్రమశిక్షణ, ఆలోచనా విధానం, కష్టపడే తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యాక్టింగ్ టాలెంట్ ఒక్కటే తనను ఈ స్థాయికి తీసుకురాలేదని, క్రమశిక్షణ, నిరంతరం కష్టపడే స్వభావమే తన విజయానికి ప్రధాన కారణాలని చిరంజీవి వివరించారు.

ఎక్సర్‌సైజ్, డైట్ వల్ల కాదు..

తాను ఇప్పటికీ యంగ్‌గా కనిపించడానికి కారణమేంటని, ఎలాంటి వ్యాయామాలు చేస్తారని ఇటీవల కొందరు అడిగారని చిరంజీవి చెప్పారు. అయితే తన యవ్వనంగా కనిపించడానికి కేవలం ఎక్సర్‌సైజ్, డైట్ కారణం కాదని అన్నారు. తల్లిదండ్రులు, దైవం, గురువులు, తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో ఉంటానని చిరంజీవి తెలిపారు. ఆ మానసిక సంతృప్తి, ప్రశాంతత తనలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయని, అదే తనను యంగ్‌గా కనిపించేలా చేస్తోందని చెప్పారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు