Dorothy Review: కీర్తి సురేష్ డోరతీ సినిమా ఎలా ఉందంటే..

కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘డోరతి’. కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా విడుదల చేసింది. కుల, లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలం, ట్రాన్స్‌జెండర్ల జీవన సంఘర్షణలను కథలో మేళవించిన ఈ చిత్రం ‘డోరతి’. మరి ఎలా ఉందంటే..

2 అక్టోబర్, 2026 4:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Dorothy Review: కీర్తి సురేష్ డోరతీ సినిమా ఎలా ఉందంటే..

Dorothy Review | అక్టోబర్ 2 (జనవాణి): తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో ‘డోరతి’ కథ సాగుతుంది. సుబ్బు (సనంత్‌), కార్తీ (రిషికాంత్‌) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. గొడవలకు అలవాటు పడిన వీరిద్దరూ పెరిగినా అదే స్వభావంతో ఉంటారు. సుబ్బుది కాస్త పలుకుబడి ఉన్న కుటుంబం. అతని తండ్రి విజిల్‌ వీరయ్య (ముత్తుకుమార్‌)కు కులం, పరువు, ప్రతిష్ఠే ముఖ్యం. ఇంట్లో ఆడవారి ఉనికిని కూడా ఇష్టపడని అతని కుటుంబంలోకి డోరతి (కీర్తి సురేశ్‌) కోడలిగా వస్తుంది.

డోరతితో పరిచయం సుబ్బులో ఊహించని మార్పు తీసుకొస్తుంది. ఆమెతో సన్నిహితంగా మెలిగే క్రమంలో అతనిలోని సున్నితమైన కోణం బయటపడుతుంది. అయితే డోరతి అనూహ్యంగా మరణిస్తుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కేసును ముగించేస్తారు. కానీ సుబ్బు మాత్రం తన అన్న, తండ్రే ఆమె మరణానికి కారణమని అనుమానిస్తాడు. మరోవైపు ఓ గొడవలో సుబ్బును కాపాడేందుకు కార్తీ ఓ వ్యక్తిని చంపేస్తాడు. కుటుంబం తీరుతో విసిగిపోయిన సుబ్బు తనలోని నిజాన్ని బయటపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. సుబ్బును అలా చూడలేని విజిల్‌ వీరయ్య అతన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? డోరతి మరణం వెనుక అసలు కారణమేంటి? సుబ్బు, కార్తీల స్నేహం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

సమాజంలోని అసమానతలను కథలుగా మలచడంలో కార్తిక్‌ సుబ్బరాజుకు ప్రత్యేకమైన శైలి ఉంది. ‘డోరతి’లోనూ కుల వివక్ష, లింగ వివక్ష, పితృస్వామ్య భావజాలంతో పాటు ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొనే సామాజిక సమస్యలను దర్శకుడు తెరపైకి తీసుకొచ్చారు.

ఫస్టాఫ్‌ సుబ్బు, కార్తీల బాల్యం, వారి స్నేహం, కుటుంబ నేపథ్యం, గ్రామీణ వాతావరణం చుట్టూ సింపుల్‌గా సాగుతుంది. డోరతి ఎంట్రీ తర్వాత కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆమెతో సుబ్బుకు ఏర్పడే అనుబంధం అతని వ్యక్తిత్వంలో మార్పును తీసుకురావడం ఆకట్టుకుంటుంది. డోరతి మరణంతో వచ్చే ఇంటర్వెల్‌ తర్వాత కథపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది.

అయితే సెకెండాఫ్‌లో కథనం కొంత నెమ్మదిస్తుంది. సుబ్బు తన గురించి నిజాన్ని బయటపెట్టడం, కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులు, అతన్ని చంపేందుకు తండ్రి చేసే ప్రయత్నాలు, ట్రాన్స్‌జెండర్ల జీవన విధానం వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో కథ కొంత సాగదీసిన భావన కలుగుతుంది.

అయితే సుబ్బు, కార్తీల మధ్య స్నేహబంధం, వారి ప్రయాణం సెకెండాఫ్‌లో సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ముఖ్యంగా తన ప్రాణ స్నేహితుడైన సుబ్బును చంపేందుకు కార్తీ వేసే ప్లాన్‌ ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్‌ వైపు వెళ్లే కొద్దీ భావోద్వేగాలు కూడా బలపడతాయి. డోరతి మరణానికి అసలు కారణమేంటనే విషయాన్ని పూర్తిస్థాయిలో స్పష్టంగా చెప్పకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో పనిచేసిన కామెడీ, సెకెండాఫ్‌లోని భావోద్వేగాలు ఆకట్టుకున్నా స్క్రీన్‌ప్లే మాత్రం కొన్ని చోట్ల ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్‌ చేస్తుంది.

నటీనటుల పనితీరు

కార్తీ పాత్రలో రిషికాంత్‌ రా అండ్‌ రగ్డ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. సుబ్బు పాత్రలో సనంత్‌ మరోసారి తన నటనా సామర్థ్యాన్ని చూపించారు. ముఖ్యంగా సుబ్బు తన నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన తర్వాత ఆయన నటనలోని మరో కోణం కనిపిస్తుంది. ఎక్స్‌ప్రెషన్స్‌, బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు న్యాయం చేశారు. సుబ్బు, కార్తీల మధ్య స్నేహబంధం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీర్తి సురేశ్‌ కనిపించేది కొద్దిసేపే అయినా డోరతి పాత్ర కథకు కీలకం. ఆమె తన సహజమైన నటనతో మెప్పించింది. విజిల్‌ వీరయ్యగా ముత్తుకుమార్‌ చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా..

‘డోరతి’కి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. తిరునావుక్కరసు కెమెరా పనితనం కథను 90ల కాలంలోకి తీసుకెళ్తుంది. తమిళ గ్రామీణ నేటివిటీని, సహజమైన వాతావరణాన్ని విజువల్స్‌లో చక్కగా చూపించారు. ఇళయరాజా సంగీతం కథకు తగ్గ భావోద్వేగాన్ని అందించింది. ఎడిటింగ్‌ విషయంలో మాత్రం సెకెండాఫ్‌ను మరింత కుదించి ఉంటే సినిమా వేగంగా అనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా..

కులం, లింగ వివక్ష, పితృస్వామ్యం, ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొనే అవమానాలు, వారి అంతర్మథనం వంటి సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చిన ప్రయత్నం ‘డోరతి’. కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలోని గందరగోళం, సెకెండాఫ్‌లోని సాగదీత ప్రభావం చూపాయి. సనంత్‌, రిషికాంత్‌ల నటన, సుబ్బు–కార్తీల స్నేహబంధం, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. భిన్నమైన కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఆసక్తికరంగా అనిపించే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు