విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు’. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సీపీఐ నేత కె. రామకృష్ణ కుమారుడు హర్ష హీరోగా పరిచయమయ్యారు. 1995 నేపథ్యంలో మిస్టరీ, మ్యూజిక్, ప్రేమ, స్నేహం చుట్టూ సాగే ఈ సినిమా ఎలా ఉందంటే..

18 సెప్టెంబర్, 2026 4:48 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!

Movie Review: ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’, ‘మధుమాసం’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రసిద్ధార్థ్.. ఎనిమిదేళ్ల తర్వాత ‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ఎ ఫర్ బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్ బిడెన్ సాగా’ అనేది ట్యాగ్‌లైన్. వై.వి. సత్యనారాయణ రాజు, అగస్త్య మంజు, సాగర్, మహిలతో కలిసి చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష హీరోగా పరిచయం అయ్యారు.

కథేంటి?

కథ 1995లో జరుగుతుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న సాగర్ (హర్ష) అమెరికాలో ఉన్న తన డాక్టర్ అన్నయ్య సలహాతో రాజమండ్రి ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంటాడు. అతని బాగోగులను నీలి (రేఖా నిరోషా), దాము (అశోక్ వర్థన్) చూసుకుంటుంటారు.

సాగర్‌ను ఓ పాట పదేపదే వెంటాడుతుంటుంది. ప్రతిరోజూ రాత్రి పది గంటల తర్వాత అతని రేడియోలో అదే పాట ప్రసారమవుతుంది. విచిత్రంగా ఆ పాటను నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి తదితరులు కోరినట్లు ఆర్‌జే ప్రకటిస్తుంది. మరోవైపు ఓ యువతి తనను వెంటాడుతున్నట్లు సాగర్‌కు కలలు వస్తుంటాయి.

నీలి, దాము పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ మిస్టరీని ఛేదించాలని సాగర్ నిర్ణయించుకుంటాడు. రేడియో స్టేషన్‌కు వెళ్లి ఆరా తీయగా నెమలిపాలెం నుంచి రెగ్యులర్‌గా పోస్ట్‌కార్డులు వస్తున్నాయని, అందుకే ఆ పాటను ప్రసారం చేస్తున్నామని ఆర్‌జే కావేరి (ఇనయా సుల్తానా) చెబుతుంది.

దీంతో సాగర్ నెమలిపాలెం గ్రామానికి బయలుదేరతాడు. అయితే అక్కడ మనుషులే లేకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఆ గ్రామం నుంచి రేడియో స్టేషన్‌కు ఉత్తరాలు ఎలా వస్తున్నాయి? ఆ పాటను రూపొందించిన మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు ఏమయ్యారు? వారి వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? అనేదే మిగతా కథ.

ఫస్ట్ హాఫ్‌లో ఆసక్తికరమైన మిస్టరీ

సినిమా ప్రథమార్థం సాగర్‌ను వెంటాడుతున్న గతం, రేడియోలో పదేపదే వినిపించే పాట చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది. మిస్టరీని ఛేదించేందుకు సాగర్ ప్రయత్నించడం వరకు కథనం ప్రత్యేకమైన టోన్‌లో ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన ‘అన్వేషణ’, ‘ఆలాపన’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి.

అయితే ద్వితీయార్థంలో కథ పూర్తిగా మ్యూజిక్ బ్యాండ్ చుట్టూ మారుతుంది. ఆరుగురు సభ్యుల మధ్య స్నేహం, ప్రేమ, అసూయ, ద్వేషం కారణంగా ఏర్పడే విభేదాలు కథలో కీలకంగా మారతాయి. రాజమండ్రి వరదలు, బ్యాండ్ సభ్యులు అదృశ్యం కావడం, బతికిపోయిన నందు గతాన్ని మర్చిపోవడం వంటి అంశాలు కథలోకి వస్తాయి.

సెకండ్ హాఫ్‌లో తగ్గిన థ్రిల్

ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్‌లో అంతగా కనిపించవు. అసలు కథ ద్వితీయార్థంలో ప్రారంభం కావడంతో కీలక పాత్రలు ఒక్కసారిగా తెరపైకి వస్తాయి. వారి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, అసూయలను బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి తగినంత సమయం లేకపోవడం మైనస్‌గా మారింది.

ప్రథమార్థాన్ని కొంత ట్రిమ్ చేసి, అసలు కథను ముందుగానే ప్రారంభించి ఉంటే ద్వితీయార్థానికి మరింత బలం వచ్చేది. అలాగే సాగర్‌పై నీలికి ఉన్న అబ్సెషన్‌కు సరైన కారణం స్పష్టంగా కనిపించదు. రమ తన గతాన్ని చెప్పగానే సాగర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం కూడా పూర్తిగా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఇలాంటి కొన్ని లూప్‌హోల్స్ కథనాన్ని ప్రభావితం చేస్తాయి.

నటీనటుల పనితీరు

హర్షకు ఇది తొలి సినిమా. నటన పరంగా ఇంకా మెరుగుపడాల్సి ఉన్నప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు ప్రయత్నించే అవకాశం ఆయనకు ఉంది.

రేఖా నిరోషా, అశోక్ వర్థన్ ప్రథమార్థంలో కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ద్వితీయార్థంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, అనిరుధ్ శ్రీవాస్తవ, సన్నీ, గిరి ముఖ్య పాత్రలు పోషించారు. అమైరా తన పాత్ర పరిధిలో చక్కగా నటించారు. సుజనా రెడ్డి కొన్ని సన్నివేశాల్లో మెప్పించారు. రవివర్మ డాక్టర్ పాత్రలో బాగా సరిపోయారు. ఇనయా సుల్తానా అతిథి పాత్రలో కనిపించారు.

టెక్నికల్‌గా..

సినిమాకు ప్రధాన బలం జే రెక్స్ సంగీతం, నేపథ్య సంగీతం. స్వర రచనతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాలోని పాటలను దర్శకుడు చంద్రసిద్ధార్థ్ రాశారు.

సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు అవసరమైన వాతావరణాన్ని కెమెరా పనితనం చక్కగా అందించింది. సీనియర్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ రాసిన సంభాషణలు సహజంగా ఉన్నాయి.

చివరిగా..

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ అనేది ఈ సినిమాకు ప్రచారపరంగా ఆసక్తికరమైన అంశం. అయితే అది కథకు పెద్దగా ఉపయోగపడదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మిస్టరీ, మ్యూజిక్ నేపథ్యంలో కథను చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే కథనంలో కొన్ని లూప్‌హోల్స్, ద్వితీయార్థంలో తగ్గిన థ్రిల్, పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్‌లో లోపాలు సినిమాను కొంత ప్రభావితం చేశాయి. విభిన్నమైన కథాంశాలు, మిస్టరీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి ప్రయత్నించవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు