ఇటీవల కొందరు మేకర్స్ కథ, కథనం ఎలా ఉన్నా బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ను థియేటర్లకు రప్పించొచ్చనే ఆలోచనతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ‘హుషారు పిట్టలు’ కూడా ఇదే కోవలోకి వస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహించగా వెంకట్ యాదవ్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంపై సోషల్ మీడియాలో పలు కామెంట్లు, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సినిమా పేరుకు తగ్గట్టుగా ‘హుషారు పిట్టలు’ కంటే ‘మసాలా పిట్టలు’ అనే పేరు బాగుండేదంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
అసలు కథేంటి?
కథ విషయానికొస్తే.. పోర్న్ వీడియోలకు అలవాటు పడిన ఓ యువకుడు తన పక్క వీధిలో ఉండే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అతడికంటే ఎక్కువగా లైంగిక ఆలోచనలతో ఉండే ఆ అమ్మాయి కూడా అతడిని మరింత ప్రోత్సహిస్తుంది. యుక్తవయసులో వచ్చే మార్పులు, అవగాహన లోపం కారణంగా ఇద్దరూ హద్దులు దాటే పరిస్థితికి చేరుకుంటారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? చివరకు ఆ ప్రేమకథ ఎలా ముగిసింది? అనేదే సినిమా ప్రధాన కథాంశం.
కథ కంటే బోల్డ్ కంటెంట్‌పైనే ఫోకస్?
యూత్ లవ్ స్టోరీతో పాటు టీనేజ్‌లో ఎదురయ్యే సమస్యలు, అవగాహన అవసరం వంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలోని చాలా సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడం కంటే అడల్ట్ కామెడీ, బోల్డ్ డైలాగ్స్, క్రింజ్ సన్నివేశాల చుట్టూనే తిరుగుతాయని విమర్శలు వస్తున్నాయి.
ఇంట్లో పెద్దలతో ఎలా ప్రవర్తించాలి? చిన్నపిల్లల ముందు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు? వంటి అంశాలను చెప్పాలనుకున్నారా, లేక కేవలం అడల్ట్ డ్రామాను చూపించడమే లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
లాజిక్స్‌కు దూరంగా సాగిన కథనం
సినిమా ముందుకు సాగేకొద్దీ సంబంధం లేని మలుపులు, అనూహ్యంగా వచ్చే పోక్సో కేసులు, లీగల్ డ్రామా వంటి అంశాలు కథనంపై ఆసక్తిని తగ్గిస్తాయని విమర్శలు ఉన్నాయి. టీనేజ్‌లో అవగాహన లోపం వల్ల ఎదురయ్యే సమస్యలను చూపించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ దానికి తగ్గ కథనం కంటే క్రింజ్ కంటెంట్ ఎక్కువగా కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చివర్లో ఇచ్చే సందేశం కోసం సినిమా మొత్తం ఇలాంటి సన్నివేశాలను భరించాల్సి వచ్చిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం కష్టమేనంటూ సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
మొత్తంగా యూత్‌ను ఆకట్టుకోవడానికి బోల్డ్ కంటెంట్ ఒక్కటే సరిపోదని దానికి బలమైన కథ, ఆసక్తికరమైన కథనం కూడా అవసరమని ‘హుషారు పిట్టలు’పై వస్తున్న సోషల్ మీడియా స్పందన చెబుతోంది.




















