తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగా, ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ హీరో జైకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జైకృష్ణ హీరోగా పరిచయమైన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదలైంది. మరి తొలి సినిమాతో జైకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? ట్విట్టర్‌లో వస్తున్న స్పందనలు ఎలా ఉన్నాయి? చూద్దాం.
కథ ఏంటి? : సినిమా కథ విషయానికి వస్తే... తిరుపతికి చెందిన శ్రీను, మంగ అనే యువతిని ప్రేమిస్తాడు. ఆమెని ప్రేమలో పడేయడానికి చాలా కష్టపడతాడు. అయితే మంగ, శ్రీనుని ప్రేమించిన తర్వాతే అసలు సమస్యలు పెరుగుతాయి. అయితే వారి ప్రేమకు ఫ్యాక్షన్ నాయకుడు బళ్లారి వెంకటప్పయ్య నాయుడు అడ్డుగా నిలుస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే సినిమా ప్రధాన కథ. అసలు బళ్లారి వెంకటప్పయ్య నాయుడు ఎవరు? శ్రీను, మంగలకు అతనితో ఉన్న సంబంధం ఏంటి? మరి వీరి ప్రేమ కథకి హ్యాపీ ఎండింగ్ దక్కిందా? లేదా? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
జైకృష్ణ తొలి సినిమానే అయినప్పటికీ తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఎనర్జీ చూపించాడని, ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం మరింత మెరుగుపడాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు.
హీరోయిన్ రాషా తడానీ అందంగా కనిపించడంతో పాటు తన పాత్రకు న్యాయం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విలన్ పాత్రలో మోహన్ బాబు మరోసారి తన అనుభవాన్ని చాటుకున్నప్పటికీ, ఆయన పాత్రను పూర్తిస్థాయిలో వినియోగించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించగా, సినిమాటోగ్రఫీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
దర్శకుడు అజయ్ భూపతి నుంచి 'RX100', 'మంగళవారం' తరహా బలమైన కథను ఆశించిన ప్రేక్షకులకు ఈ సినిమా కొంత నిరాశ కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ అయినప్పటికీ, కథనం చాలా వరకు ఊహించదగ్గ విధంగా సాగుతుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే 'శ్రీనివాస మంగాపురం' ఒక రొటీన్ కమర్షియల్ లవ్ స్టోరీగా నిలిచింది. జైకృష్ణ నటన, రాషా తడానీ గ్లామర్, మోహన్ బాబు విలనిజం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తుండగా, కథలో కొత్తదనం లేకపోవడం, ట్విస్టులు ఆశించిన స్థాయిలో లేకపోవడం మైనస్‌లుగా చెప్పబడుతున్నాయి.
వైజయంతీ మూవీస్ సి. అశ్వనీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు.
ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో వీకెండ్ కలెక్షన్లు నిర్ణయించనున్నాయి.




















