హైదరాబాద్: దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ తాజాగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అభిమానం పేరుతో హద్దులు దాటిన ఒక సంఘటన ఇప్పటికీ తనకు గుర్తుండిపోయిందని చెప్పారు.
కాజల్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలి టేక్ పూర్తయ్యాక ఆమె కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా, తలుపు కూడా తట్టకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కారవాన్‌లోకి ప్రవేశించాడని చెప్పారు.
అతను అక్కడితో ఆగకుండా తన షర్ట్ తీసి, ఛాతీపై కాజల్ పేరు టాటూ వేయించుకున్నట్లు చూపించాడని తెలిపారు. ఆ ఘటనతో ఒక్కసారిగా తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని, కొద్దిసేపు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు.
అయితే పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొన్నట్లు కాజల్ వివరించారు. తన పేరుతో టాటూ వేయించుకోవడం అభిమానానికి నిదర్శనమే అయినప్పటికీ, ఒక మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అనుమతి లేకుండా లోపలికి రావడం మాత్రం అంగీకారయోగ్యం కాదని అతనికి స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. అలాంటి చర్య తప్పని, మళ్లీ ఎప్పుడూ చేయొద్దని సూచించి అక్కడి నుంచి పంపించినట్లు చెప్పారు.
ఈ ఘటన తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిందని కాజల్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో కూడా అభిమానులు స్పందిస్తున్నారు. అభిమానం ఉండటం మంచిదే కానీ, వ్యక్తిగత గోప్యతను గౌరవించడం అంతే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం 'చందమామ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' విజయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
ఆ తర్వాత 'డార్లింగ్', 'బృందావనం', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'బిజినెస్‌మ్యాన్', 'నాయక్', 'బాద్‌షా', 'ఎవడు', 'టెంపర్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా నిలిచారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ విజయవంతమైన సినిమాలు చేశారు.
2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజల్‌కు నీల్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.




















